సిద్దిపేట, సెప్టెంబర్ 30: ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను పరామర్శించడానికి కాంగ్రెస్ మంత్రులు,ఎమ్మెల్యేలకు సమయం లేదని, వారి బతుకులను కాంగ్రెస్ సర్కారు ఆగంజేసిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.సోమవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సంస్థ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు యూనిఫామ్‌లను ఆయన ఆందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆటో కార్మికులు సమస్యలపై అసెంబ్లీలో ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ప్రభుత్వం మెడలు వంచి ఆటో కార్మికుల సంక్షేమాని కృషి చేస్తానన్నారు. 56 మంది ఆటో కార్మికులు చనిపోతే ప్రభుత్వానికి చీమ కుట్టినైట్లెనా లేదన్నారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ దేశానికే ఆదర్శమన్నారు. ఈ సొసైటీ ద్వారా రూ.2.10 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. కార్మికులకు రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పించామన్నారు.26మంది ఆటో కార్మికులు చనిపోతే నూ.2లక్షల చొప్పున బీమా పరిహారం అందజేసినట్లు తెలిపారు.
63 మంది పెండ్ల్లిలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ కోసం తన ఇంటిని తాకట్టు పెట్టినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు. సొసైటీ తరపున పెట్రోల్‌బంకు ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే ఆదాయం కార్మికులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఆటో కార్మికులు చెడు వ్యసనాలకు దూరం గా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్మికులకు రూ.2లక్షల చెక్కును ఆందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు పాల సాయిరాం పాల్గొన్నారు.