గజ్వేల్‌అర్బన్, డిసెంబర్19: బిగ్‌బాస్-7 రియాల్టీ షో విజేత పల్లవి ప్రశాంత్‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఫోన్ ద్వారా అభినందించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. గజ్వేల్ మండలం కొల్గూరులో పుట్టిన ప్రశాంత్ రెండు తెలుగు రాష్ర్టాల్లో రైతుబిడ్డగా గొప్ప పేరు తెచ్చుకోవడం గర్వంగా ఉందన్నారు. యూత్ ఐకాన్‌గా మారిన పల్లవి ప్రశాంత్‌ను, తల్లిదండ్రులను అభినందించారు. రైతు బంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు మద్దిరాజిరెడ్డి, కొల్గూరు ఎంపీటీసీ జ్యోతీస్వామి, బీఆర్ఎస్ నాయకులు రమేశ్‌గౌడ్, అహ్మద్, నరేశ్‌గౌడ్, నిజామొద్దీన్, పురం ఆంజనేయులు, కొండల్‌రెడ్డి, అనిల్, నరేశ్ పాల్గొన్నారు.
బిగ్‌బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలని పల్లవి ప్రశాంత్ తరఫు హైకోర్టు న్యాయవాది రాజేశ్‌కుమార్ పోలీసులను కోరారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మతో కలిసి న్యాయవాది విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిగ్‌బాస్ సీజన్-7లో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ పోలీసులు కేసు నమోదు చేయడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. కాబట్టి వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ వివరాలను ఆన్లైన్లో పొందుపరిస్తే వాటిని పరిశీలించి తాము తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.