సిద్దిపేట, జనవరి 17: ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల్లో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామసభల్లో ప్రజలు ఎండగట్టాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులతో హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను మోసం చేస్తుందని, ఇప్పటికే 6 గ్యారంటీలను అటకెకించిందని, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నదని మండిపడ్డారు..
గ్రామాల్లో వీటిపై గ్రామసభలు నిర్వహిస్తున్నారని, ఈ సభల్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని అర్హులైన పేదలకు, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.. ఆత్మీయ భరోసా పేరు మీద రైతులను ప్రభుత్వం మోసం చేస్తున్నదని, ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని అడగాలన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే, కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లాలో 2లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో 75000 మందికే వర్తిస్తుందని, మిగతా లక్షా 25వేల మంది కూలీల సంగతి ఏంటన్నారు. వీరంతా రోజూ పనికి వెళ్లే నిరుపేదలని, అందులో ఎస్సీ ఎస్టీ, బీసీలో ఎకువగా ఉంటారన్నారు. గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించమని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమన్నారు.
ఎకరంలోపు భూమి ఉన్న రైతుకు కూడా ఈ పథకం వర్తించాలని గ్రామ సభలో అడగాలన్నారు. ఒక గుంట భూమి ఉన్నా కూలీ కాదని, ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలిగా గుర్తింపు అనే నిబంధన కూడా సరైనది కాదన్నారు. అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ 60 ఏండ్లు నిండిన రైతుకు, పనికి వెళ్లని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించారని ప్రభుత్వం చెబుతున్నదన్నారు. ఈజీఎస్ పథకంలో కూలీలు 60 ఏండ్లు దాటితే కార్డు కోల్పోతారు. ఈ పథకంలో ఈజీఎస్ నిబంధన విధించకుండా అమలు చేయాలి. రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలన్నారు.
గ్రామాల్లో వ్యవసాయ కూలీలు కోటి మంది ఉంటారని, కానీ, ప్రభుత్వం 6 లక్షల మందికే ఈ పథకం వర్తించేలా చేస్తున్నదని హరీశ్‌రావు చెప్పారు. కూలీలను గుర్తించేది.. హైదరాబాద్ సచివాలయంలోనా.. గ్రామ సచివాలయం వద్ద..? అని గట్టిగ నిలదీయాలన్నారు. రైతు భరోసా రూ.10 వేలును రూ.15 వేలు చేస్తామని ఎన్నికల్లో ప్రగల్బాలు పలికి, కోతలు… ఎగవేతలతో రూ.12 వేలు ఇస్తున్నారన్నారు.. ఎగొట్టిన వానకాలం రూ.6 వేలు సంగతి ఏందీ అని వానకాలం పైసలు ఇవ్వాలని గ్రామ సభలో తీర్మానం చేపించాలన్నారు. న్యాయంగా ఉండే వారికి రైతుభరోసా వచ్చేలా చుడాలని, అర్హులైన రైతులందరినీ గుర్తించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇంటి స్థలం ఉండి కిరాయికి ఉన్నవారికి, గుడిసెల్లో ఉండే వారికి, కవర్లు కప్పి ఉన్న ఇండ్లకు, అనాథలకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు స్థలం ఉంటే ఇది వర్తిస్తుందని, అలాంటి వారిని గుర్త్తించి అర్హులైన వారికి అందేలా చూడాలన్నారు..
రేషన్ కార్డు విషయంలో ఇప్పటికి గ్రామాల్లో, పట్టణంలో కులగణనకు సంబంధం పెట్టి కొంతమందికి మాత్రమే వచ్చాయని, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారి విషయం, కేసీఆర్ ప్రభుత్వంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి సంగతి ఏంటి అని గ్రామసభల్లో నిలదీయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామసభల్లో ప్రతి ఒకరూ పాల్గొని ప్రజల వైపు నిలబడాలని, నిజమైన, అర్హులైన పేదలందరికీ న్యాయం జరిగేలా చూడాలని.. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.