జహీరాబాద్, అక్టోబర్ 3 : ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న బాధితులు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న భూబాధితులు డప్పూర్‌లో చేపట్టిన ఆందోళనలో పాల్గొని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు దగ్గరగా, కాలుష్యం లేకుండా జీరో వ్యర్థాలతోపాటు అన్ని అనుమతులతో 15 వేల ఎకరాల భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయకుండా రియల్ ఎస్టేట్ చేసి, న్యాల్కల్ మండలంలోని వడ్డి, మల్గి, డప్పూర్ గ్రామ శివారులోని 2003 ఎకరాల బంగారం లాంటి పచ్చని భూములను ఎలాంటి సమాచారం లేకుండా బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.
పోరంబోకు, రాళ్లు, రప్పలతో వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసుకోవాలే తప్ప, బంగారం లాంటి భూములను ఫార్మాసిటీకి గుంజుకుని రైతులను రోడ్డుపాలు చేస్తామంటే చూస్తూ ఉరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జేసీబీ, ప్రొక్లెయిన్ వస్తే ఎమ్మెల్యే మాణిక్రావుతోపాటు తాను అడ్డం పోతామన్నారు. భూబాధితులకు చెందిన గుంటా భూమి కూడా ఫార్మాసిటీ కోసం సేకరించకుండా బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టును ఆశ్రయించి పైసా ఖర్చు లేకుండా బాధితుల పక్షాన కేసులు వేస్తామన్నారు.
అవసరమైతే ఫార్మాసిటీ భూబాధితుల కోసం అసెంబ్లీలో కొట్లాడుతామన్నారు. బాధిత రైతులెవ్వరూ అధైర్యపడవద్దని, ఒకమాట మీద ఉండండి, ఎవరు వస్తారో, ఎట్లా వస్తారో చూస్తామన్నారు. ఫార్మాసిటీ కోసం భూసేకరించేందుకు ఎవరైన వస్తే ఒక్క ఫోన్ చేయండి, రెండు గంటల్లో వస్తామన్నారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం చేసి భూములను దక్కించుకుందామని హరీశ్‌రావు రైతులకు భరోసానిచ్చారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్న ఆయా గ్రామాల పరిధిలోని చెరువులు, వాగుల నుంచి కాలుష్య జలాలు మంజీరాలో చేరి పాడైపోతాయన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు నిజామాబాద్, హైదరాబాద్ జంటనగరలకు తాగు, సాగు నీటిని ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ పాలనలో సంగమేశ్వర, బసమేశ్వర ప్రాజెక్టులు ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టకుండా నిలిపివేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. 300 రోజుల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ రైతుబంధుకు దిక్కులేదని, అసంపూర్తిగా రుణమాఫీ, దసరా పండుగకు బతుకమ్మ చీరలు, నెలనెలా పింఛన్లు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ఆడ పిల్లల పెండ్లికి తులం బంగారం, మహిళాలకు రూ. 2,500 ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ జామకు, డప్పూర్ పుదీనాకు ఫేమస్ అని హరీశ్‌రావు అన్నారు. డప్పూర్ సమీపంలో ఫార్మాసిటీతో భూములు కోల్పోతున్న రైతుల పొలాలను సందర్శించారు. పొలాల్లో రైతులు సాగు చేసిన పత్తి, పుదీనా తదితర పంటలను పరిశీలించారు. అనంతరం పలువురు రైతులతో ఆయన మాట్లాడారు. బోరు, బావుల కింద పత్తి, కంది, సోయాబీన్, మినుము, పెసర, మొక్కజొన్న, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, కూరగాయల పంటలతోపాటు పాడి పశువులు, మేకలు, గొర్రెల పెంపకంతో జీవనాన్ని సాగిస్తున్నమని రైతులు పేర్కొన్నారు.
మేము పండిస్తున్న పుదీనాను ప్రతిరోజూ జహీరాబాద్, బీదర్, నారాయణఖేడ్‌తోపాటు బోయిన్పల్లి మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని రైతులు తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో డప్పూర్ గ్రామానికి విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరుతోపాటు మిషన్ కాకతీయ కింద చెరువులో పూడికతీత పనులు చేపట్టామని గుర్తు చేశారు. భూమి, నీరు, గాలిని కాలుష్యకోరల్లోకి నెట్టే ఫార్మాసిటీకి ప్రాణాలు పోయినా సారవంతమైన భూములు మా త్రం ఇచ్చేది లేదంటూ రైతులు కన్నీరు పెట్టకున్నారు.
ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాటం చేస్తామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. ఇప్పటికే న్యాల్కల్ మండలంలోని 17 గ్రామాల్లో నిమ్జ్ పేరుతో నాశనం చేశారని, మళ్లీ కొత్తగా మూడు గ్రామాల్లో 2వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటే చూస్తూ ఉరుకోబోమని స్పష్టం చేశారు. రసాయన కంపెనీలు వస్తే ఆయా గ్రామాల పరిస్థితి ఏమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములు ఉనికి కోల్పోవడమే కాకుండా ఈ ప్రాంతం కలుషితమై నివాసయోగ్యం కాకుండా పోతుందన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, నారాయణఖేడ్, అందోల్ మాజీఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ నాయకులు బీరయ్యయాదవ్, పెంటారెడ్డి, నామ రవికిరణ్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, మండల నాయకులు భాస్కర్, నర్సింహారెడ్డి, రాజేందర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, రాజ్‌కుమార్, వీరారెడ్డి, మారుతీయాదవ్, రవికుమార్, గ్రామ నాయకులు రవికుమార్, శివరాజ్, నాగన్న, పూండికూర రవికుమార్, రాజు గౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పచ్చని పొలా లు, ఎత్తయిన గు ట్టలు, ప్రకృతి రమణీయమైన భూ ముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చే యడం సరికాదు. గుట్టు చప్పుడు కా కుండా సర్వేలు చేప ట్టి బలవంతంగా భూమిని సేకరిస్తూ రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు. ప్రాణాలు పోయిన సరే.. తాతలు, ముత్తాతలు, పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన, కొనుగోలు చేసిన పట్టా, ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీకి ఇవ్వబోం. పంట భూములను సేకరించవద్దు. ఫార్మాసిటీని ఏర్పాటును ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. లేనిపక్షంలో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఎంతవ రకైనా పోరాటం చేస్తాం.
– రవి కుమార్, రైతు, గ్రామ మాజీ సర్పంచ్