మెహిదీపట్నం, మే 25: కవిత్వంతో, సామాజిక కృషితో తెలంగాణ సమాజం మీద బలమైన ప్రభావం వేసిన వ్యక్తి నందిని సిధారెడ్డి అని, తెలంగాణ గడ్డ మీద జరిగిన ప్రతి ఉద్యమంలోనూ ఆయన పాత్ర గణనీయంగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లోని కాంటినెంటల్ పార్క్ హోటల్లో సిధారెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. తనకు నందిని సిధారెడ్డితో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందన్నారు. సిధారెడ్డి నిరాడంబరంగా, నిక్కచ్చిగా ఉంటారన్నారు.
ఒకరి నుంచి ప్రయోజ నం పొందడం కోసమో, ఒకరి నుంచి మెప్పు పొందడం కోసమో చాలామంది తమ అభిప్రాయాలను ఈజీగా మార్చుకుంటారని, కానీ.. సిధారెడ్డి మాత్రం నమ్మిన విలువలకు కట్టుబడి నిజాయితీగా, నిబద్ధతతో ఉంటూ దేనికోసం రాజీపడని మనస్తత్వం ఆయన సొంతమన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రమోషన్ సైతం వదులుకున్నారని గుర్తుచేశారు. ప్రలోభాలకు ఆయన లొంగరని, ఇటీవల కాంగ్రెస్ ప్రభు త్వం సిధారెడ్డికి కోటి రూపాయలు నగదు, 300 గజాల జాగ ఇవ్వజూపితే తిరస్కరించారన్నారు.
తెలంగాణ తల్లి రూపం మార్చినందుకు నిరసన తెలియజేసి, ప్రభుత్వం ఇవ్వజూపిన అవార్డును తిరస్కరించడంతో సిధారెడ్డి వ్యక్తిత్వం ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందని పేర్కొన్నారు. అందుకే ఆయన కవిత్వం, వ్యక్తిత్వం అంటే ఎంతో ఇష్టమన్నారు. సిధారెడ్డి తన కవిత్వంలో స్పృశించని అంశం లేద ని, ముఖ్యంగా తెలంగాణ రైతుల కష్టాల గురించి, కన్నీళ్ల గురించి ఆయన రాసిన కవితలు అద్భుతమని హరీశ్‌రావు గుర్తుచేశారు. రైతులు, స్త్రీలు, దళితులు, సమాజంలో అణిచివేతకు గురవుతున్న వారి పక్షాన నిలబడి కవిత్వం రాశారని, రైతుల గురించి ‘బోరు దు:ఖం’ అనే ఒక అద్భుతమైన కవిత రాశారని హరీశ్‌రావు గుర్తుచేశారు.
సిధారెడ్డికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా ఆత్మీయులు అందరం కలిస్తే బాగుంటుందని దేశపతి శ్రీనివాస్, విరాహత్ అలీ చెప్పగానే వెంటనే తాను వస్తానని చెప్పినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, సిధారెడ్డి నిండునూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారు మరెన్నో రచనలు చేసి, సమాజాన్ని చైతన్య పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.
సిధారెడ్డి కవిత్వంలో దు:ఖం ఉంటది, వ్యం గ్యం ఉంటది, కానీ.. ఏది రాసినా అది అద్భుతంగా ఉంటదని,సిధారెడ్డి కేవలం కవిత్వం రాయడంతోనే తన బాధ్యత తీరిందనుకోలేదని, మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘాన్ని స్థాపించి ఎంతో మంది కవులను తీర్చిదిద్దారని హరీశ్‌రావు కొనియాడారు. దేశపతి శ్రీనన్న, తైదల అంజయ్య, ఇంకా చాలా మంది కవులు సిధారెడ్డి చేత, మంజీరా రచయితల సంఘం చేత ప్రభావితమై, ఎదిగి వచ్చారని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతగా ఎదిగిన దేవీప్రసాద్, దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన దివంగత రామలింగారెడ్డి, జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీ, సీనియర్ జర్నలిస్టు రంగాచారి, ఇలా ఎంతో మందికి సిధారెడ్డి ప్రేరణ అని చాలామందికి తెలుసని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కేసీఆర్, సిధారెడ్డి ఇద్దరు క్లాస్ మేట్స్ అని, ఒకరంటే మరొకరికి గొప్ప గౌరవం, అనుబంధం ఉన్నాయని, సిధారెడ్డి సామర్థ్యం తెలుసు గనుకనే కేసీఆర్ తెలంగాణ సాహిత్య అకాడమీ నెలకొల్పి, దానికి మొదటి అధ్యక్షుడిగా సిధారెడ్డినే నియమించారని గుర్తు చేశారు.సిధారెడ్డి నేతృత్వంలోనే ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో గొప్పగా, విజయవంతంగా జరిగి, ప్రభుత్వానికి, తెలంగాణకు ఎంతో పేరు తెచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ సుందరీమణుల పోటీలు పెడుతున్నదని విమర్శించారు. అనంతరం సిధారెడ్డిని హరీశ్‌రావు సన్మానించారు.