కొండాపూర్, అక్టోబర్ 8: ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ శివారులోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం మల్లెపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శివలీలా జగదీశ్వర్ తన అనుచరులతో కాంగ్రెస్ వీడి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి గులాబీ జెండా ఎగుర వేయాలన్నారు.
గడప గడపకూ కాంగ్రెస్ బాకీ కార్డులను చేర్చి వారు చేస్తున్న మోసాలు, అరాచకాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగడం లేదని, సంక్షేమం ఆగిందని, అసమర్ధ పాలన కొనసాగుతోందని విమర్శించారు. మళ్లీ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని అన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులను,కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వాళ్ల అంతుచూస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, రాష్ట్ర నాయకులు ఎంఏ ముఖీమ్, డాక్టర్ శ్రీహరి, పాండు రంగం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విఠల్, నాయకులు శ్రీధర్‌రెడ్డి, రాందాస్, కొండల్‌రెడ్డి, మనోహర్ గౌడ్, మల్లగౌడ్, రుక్మోద్ద్దీన్, ప్రేమానందం, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.