సదాశివపేట, నవంబర్ 23: చెరువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు అన్ని రకాల చేప పిల్లలను సకాలంలో అందజేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని ఊబచెరువులో ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి, వారికి చేతినిండా పని కల్పించామని గుర్తు చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందులో 50శాతం కూడా చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఈ ఏడాది పది చెరువులకు మాత్రమే చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారని, 40 సొసైటీలకు 2216 మంది లబ్ధి పొందుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రస్తుతం కేటాయించిన దానికంటే రెట్టింపు ఉండేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బంది పడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వృత్తిపై ఆధారపడే మత్స్యకారుల ఉపాధిపై దెబ్బకొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు శివరాజ్ పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు సాతాని శ్రీశైలం, ఇంద్రమోహన్ గౌడ్, నాయకులు ముబీన్, నసీర్, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చాపల హనుమంతు, నల్ల సుధాకర్ పాల్గొన్నారు.