వట్పల్లి, జూలై 12: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పింఛన్లను ఇవ్వకుండా పాత లోన్లు కట్టాలని రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్న బ్యాంకు సిబ్బందిపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఏపీజీవీ బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి బాధిత రైతులు, వృద్ధుల డబ్బుల విషయంలో అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు. రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, ప్రభుత్వ ఇతర పథకాల నగదును చెల్లించకుండా అకౌంట్ హోల్డ్‌లో పెట్టారని, ఇదేమిటని ప్రశ్నిస్తే పాత బాకీలు చెల్లించాలని రైతులు, వృద్ధులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నేరుగా ఎమ్మెల్యే బాధితులతో కలిసి బ్యాంకుకు వెళ్లారు. ఆక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని బ్యాంకు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పంట పెట్టుబడులకు అప్పులు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందజేస్తున్నదన్నారు. వారి ఆవసరానికి డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తారా.. అంటూ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. ఇలాచేస్తే ప్రభుత్వ పథకాలు వారికి చేకర ఇబ్బందులు పడతారన్నారు. రేపటి నుంచి రైతులందరికీ రైతుబంధు, పింఛన్‌దారులకు డబ్బులు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. పద్ధతి మారకుంటే బ్యాంకుల ఎదుట ధర్నా చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. రైతులు, పెన్షన్‌దారులకు సకాలంలో డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలని ఆర్డీవో పాండు, ఏవో మహేశ్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు.