ఇంటింటికీ సురక్షిత తాగినీటిని అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి జనావాసానికి శుద్ధినీటిని అందించాలనే లక్ష్యంతో పైప్‌లైన్ నిర్మాణాన్ని చేపట్టి, నల్లా కనెక్షన్లు ఇచ్చి సురక్షిత తాగునీటిని సరఫరా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేడు మళ్లీ తాగునీటి కటకట మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని సరిగ్గా నిర్వహించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో పనిచేసే సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం,నిర్వహణను పట్టించుకోవడంతో పథకం లక్ష్యాన్ని నిర్వీర్యం చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సిద్దిపేట, మార్చి 20: సిద్దిపేట జిల్లాలో మొత్తం 506 గ్రామపంచాయతీల పరిధిలో 760 జనావాసాలకు మిషన్ భగీరథ పథకంలో నీళ్లందిస్తున్నారు. దీనికోసం 2793 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట్టారు. 1515 తాగునీటి ట్యాంకుల ద్వారా 2,06,118 నల్లా కలెక్షన్లు ఇచ్చి మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకువచ్చి మంగోల్ వద్ద నీటిని శుద్ధిచేసి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నియోజకవర్గాలకు,జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, ధూళిమిట్ట, మద్దూరు, కొమురవెల్లి మండలాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ పట్టణంతో పాటు అకన్నపేట, బెజ్జంకి, కోహెడ, హుస్నాబాద్ రూరల్ మండలాలకు లోయర్ మానేర్ డ్యామ్ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మంగోలు గ్రిడ్ ద్వారా ప్రతిరోజు 72 మిలియన్ లీటర్లు నీటిని తాగునీటి కోసం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రిడ్ ద్వారా 68 నుంచి 70 మిలియన్ లీటర్ ఫర్ డే(ఎంఎల్డీ)వాటర్‌ను సరఫరా చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 72 ఎంఎల్డీల వాటర్ సప్తయ్ చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ప్రతిరోజు మూడు నుంచి నాలుగు ఎంఎల్డీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు.
ఈ మంచి నీటి సరఫరా కోసం నెలకు రూ. 69 లక్షలను ప్రభుత్వం మెయింటెనెన్స్ ఖర్చు చేయగా, 2024-25 సంవత్సరానికి ఈ నిర్వహణ ఖర్చుల డబ్బులు రూ.8 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకుండా పెండింగ్ పెట్టింది.దీంతో మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయాలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. గ్రామ పంచాయతీలు నిధుల కటకటతో సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీటి సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.