మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారుల సమన్వయ లేమితో 40వేల జనాభా ఉన్న చిట్కుల్, ముత్తంగి తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ముత్తంగిలో విజేత కాలనీ రోడ్లపై మిషన్ భగీరథ నీరు వృథాగా పారుతున్నది. ప్రజలు తాగాల్సిన తాగునీరు మురుగు కాలువల్లోంచి నక్కవాగువైపు వృథాగా వెళ్తున్నాయి. ఇదే ముత్తంగి గ్రామానికి 24 రోజులుగా తాగునీరు రావడం లేదు. చిట్కుల్లో 20 రోజులుగా తాగునీరు నిలిచిపోయింది. ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు.
నీటి సమస్యనుపరిష్కరించేందుకు అధికారులు కృషి చేయడం లేదు. జాతీయ రహదారి విస్తరణ పనులతో వారంలో ఒకసారి మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి సమస్య ఉత్పన్నమవుతున్నది. ప్రస్తుతం హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద నిర్మిస్తున్న కల్వర్టు వద్ద పైపులు పగిలిపోయాయి. హైవే పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌తో సమన్వయం కుదరక పైపులు తరుచూ ధ్వంసమవుతున్నాయి. దీంతో మండు వేసవిలో చిట్కుల్,ముత్తంగి గ్రామాల్లో ప్రజలు నీటికి అల్లాడుతున్నారు.
పటాన్చెరు, మార్చి 29: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి, చిట్కుల్ గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. జాతీయ రహదారిని విస్తరణ పనులు చేపడుతుండడంతో ఈ గ్రామాలకు నీటిని సరఫరా చేసే పైపులు తరుచూ పగిలి నీటి సరఫరా నిలిచిపోతున్నది. పగిలిన పైపులకు మరమ్మతులు చేయ డం, పక్కనుంచి కొత్త లైను వేసే ఆలోచన అధికారులు చేయడం లేదు. దీంతో నీటి వృథా జరుగుతున్నది. దీంతో దాదాపు ఆరునెలలుగా ముత్తంగి, చిట్కుల్లో నీటి సమస్య తలెత్తుతున్నది. నాలుగు నెలల క్రితం ముత్తంగిలో రెండున్నర నెలలు పాటు తాగునీరు సరఫరా నిలిచిపోయింది.
ఇప్పుడు కూడా 24రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ముత్తంగి గ్రామంలో, దత్తాత్రేయ కాలనీలో రెండు మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. ఈ కనెక్షన ్లద్వారా పలు కాలనీలకు నీటిని సరఫరా చేస్తారు. పగిలిన మెయిన్ పైప్‌లైన్‌ను మిషన్ భగీరథ అధికారులు, పగులగొట్టిన కాంట్రాక్టర్ మరమ్మతులు చేయడం లేదు. కల్వర్టులు, ఇతర బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నచోట తాత్కాలికంగా పైపులు వేసి నీటిని ఇచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. ముత్తంగిలో జాతీయ రహదారి నుంచి విజేత కాలనీకి వెళ్లే దారిలో పైప్‌లైన్ పగిలి వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతూ, నేరుగా మురుగుకాలువల్లో కలుస్తున్నది. దాహం తీర్చాల్సిన తాగునీరు రోడ్లపై వృథాగా పారుతుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథ అధికారులు ఎన్ని రోజులు నీరు ఇవ్వకున్నా మున్సిపాలిటీ అధికారులు స్పందించడం లేదు. మిషన్ భగీరథ ఇంట్రాలో ఉన్న తాగునీటి పంపిణీ బాధ్యతలను గతేడాది పంచాయతీలకు బదలాయించారు. ముత్తంగి, చిట్కుల్ గ్రామ పంచాయతీలు ఇప్పుడు తెల్లాపూర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో కలపడంతో తాగునీటి సరఫరా బాధ్యతలు మున్సిపాలిటీలు చూడాలి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇస్నాపూర్‌కు నీటిని అందజేస్తున్నా, చిట్కుల్లో నీటి సరఫరాను నిర్లక్ష్యం చేస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ అధికారులు ముత్తంగిలో తాగునీటి పంపిణీ విషయాన్ని పట్టించుకోవడం లేదు. వీరి తీరుతో ప్రజలకు తాగునీరు కరువైంది.
పరిశ్రమల కాలుష్యంతో ముత్తంగి, చిట్కుల్ గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యా యి. వీటిని తాగడానికి కాదు కదా వాడటానికి కూడా పనికిరావని నిపుణులు హెచ్చరించారు. ఈ కాలుష్య పీడిత గ్రామాలకు తాగునీరు ఉచితంగా ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిట్కుల్, ముత్తంగిలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తం కావడానికి మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు, హైవే విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకాధికారుల పాలన కావడంతో వారు రిపోర్టుల పంపకం పేరున కాలయాపన చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిత్యం క్షేత్రస్థాయిలో పనిచేసేవారు. ప్రత్యేకాధికారుల ఆ పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి.
చిట్కుల్లో ఇరవై రోజులుగా తాగునీరు రావడం లేదు. మా గ్రామాన్ని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయడంతో ఇప్పుడ సమస్య మరింత తీవ్రమైంది. ఉగాది తరువాత ఖాళీ బిందెలతో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తాం. చిట్కుల్‌కు వచ్చే భగీరథ నీటి కనెక్షన్ సరిచేసి త్రివేణి స్కూల్ వద్దనుంచి వేయాలి. అప్పుడే గ్రామానికి నీళ్లు సరిగ్గా వస్తాయి. ఇప్పుడు గ్రావిటీ ఫెయిల్ అయ్యింది. మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో సమస్యను పరిష్కరించాలి.
-సుంకరి రవీందర్, మాజీ సర్పంచ్ చిట్కుల్