చేర్యాల, జూన్ 23 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే మల్లన్న ఉత్సవాలు ప్రారంభం కావడంతో 20మంది సభ్యులతో నాలుగు నెలల పదవి పాటు జంబో కమిటీని ప్రభుత్వం నియమించింది. స్వామివారి ఉత్సవాలు ముగియడంతో ప్రభుత్వం కమిటీ నియామకానికి తిరిగి గ్రీన్‌స్నిగల్ ఇచ్చింది. ఎంపీ ఎన్నికల కోడ్ రావడంతో తిరిగి కమిటీ దరఖాస్తులు, నియామకం నిలిచిపోయాయి. ప్రస్తుతం కోడ్ లేకపోవడం,డిసెంబర్లో తిరిగి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఆలయ ధర్మకర్తల మండలి నియమించేందుకు దేవాదాయశాఖ ఇటీవల నోటీఫికేషన్ జారీచేసింది. ఆసక్తిగల అర్హులు ఈనెల 28లోగా సంబంధిత ఎండోమెంట్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముం దుగా తమ నేతల అనుమతి తీసుకుని దరఖాస్తు చేసుకుంటే కమిటీలో చోటు ఖాయమనే నమ్మకంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. పదేండ్లుగా జనగామ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ సర్కారు ఆలయ కమిటీలో చోటు కల్పించింది. అలాగే హైదరాబాద్ నుంచి కొందరు దాతలకు స్థానం కల్పించింది. తాజాగా మల్లన్న ఆలయ కమిటీలో చోటు కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావడంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖను కలిసి దరఖాస్తులు అందిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ నేతలో కీలకమైన అంజన్‌కుమార్ యాదవ్ సైతం గొల్ల,కురుమలకు కమిటీ చైర్మన్, సభ్యులను ఇవ్వాలని కోరుతూ ఆయన ఇద్దరు సభ్యులకు రెకమెండేషన్ చేశారు. జనగామ నియోజకవర్గ ఇన్చార్జి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి గతంలో నియమించిన జంబో కమిటీలోని కొందరు సభ్యులను ధర్మకర్తల మండలిలో చోటుకల్పించి అందులో ఉన్న వ్యక్తినే చైర్మన్‌గా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి సైతం ఇద్దరు నాయకులను సభ్యులుగా నియమించాలని సిఫారసు చేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ జెండామోసిన కార్యకర్తలు, నాయకులు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కానీ, వాస్తవంగా అలా జరగడం లేదని కాంగ్రెస్ క్యాడర్ అస్తంతృప్తితో ఉంది. పార్టీకోసం కష్టపడిన వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన వారికి, ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేర్యాల, నర్మెట్ట మండలాలకు చెందిన ఇద్దరు నాయకులతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు నాయకులు చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ జెండాలు మోయని వ్యక్తులకు పదవులు ఇవ్వవద్దని, పార్టీ పటిష్టానికి కృషిచేసిన వారికే నామినేటెడ్ పదవుల్లో స్థ్ధానం కల్పించాలని, డబ్బులు ఉన్న నాయకులకే ప్రాధాన్యత ఇస్తే, ఇక మాకు ఎప్పుడు పదవులు వస్తాయని సీనియర్ కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.