పటాన్చెరు, సెప్టెంబర్ 24: కాంగ్రెస్ మంత్రుల తీరుపై రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డీలర్ల సమావేశానికి కాంగ్రెస్ మంత్రులు గైర్హాజరయ్యారు. వాస్తవానికి గత నెల 27వ తేదీనే రాష్ట్రస్థాయి రేషన్ డీలర్ల సమావేశం జరగాల్సి ఉండగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ షెడ్యూల్ అనుకూలంగా లేక సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు.
తిరిగి మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి సంబంధించి రేషన్ డీలర్ల సంఘం సభ్యులు మంత్రులకు ఆహ్వానం అందజేసినా ఏ ఒక్కరు కూడా హాజరుకాకపోవడంపై విస్మ యం చెందారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అన్నీతానై వ్యవహరించారు. అనంతరం రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే గూడెం మ హిపాల్రెడ్డిని డీలర్లు ఎన్నుకున్నారు.
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందజేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. దశాబ్ద కాలంగా రేషన్ డీలర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. సమావేశంలో జాతీయ అధ్యక్షుడు కృష్ణమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వంబర్ తదితరులు పాల్గొన్నారు.