సంగారెడ్డి, జూలై 9(నమస్తే తెలంగాణ): జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహా, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మధ్య దూరం తగ్గడం లేదు. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు మంత్రులు ఎడమొహం, పెడమొహం వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గురువారం సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీని జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహా, ఇన్చార్జి మంత్రి వివేక్ ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ఉదయం 9గంటలకే సంగారెడ్డికి చేరుకున్నారు. సంగారెడ్డి సమీపంలోని మల్కాపూర్‌లో ఓ నాయకుడి ఇంటికి వెళ్లిన ఇన్చార్జి మంత్రి వివేక్, ఆ తర్వాత సంగారెడ్డిలోని ఇన్స్పెక్షన్ బంగ్లాకు చేరుకున్నారు.
ఉదయం 10గంటల నుంచి ఇన్చార్జి మంత్రి వివేక్ జిల్లా మంత్రి దామోదర కోసం వేచిచూశారు. మంత్రి దామోదర షెడ్యూల్ ప్రకారం సంగారెడ్డికి 10గంటలకు చేరుకుని ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. ఆయన కోసం మంత్రి వివేక్ గంటన్నరపాటు పడిగాపులు కాశారు. ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం మంత్రి వివేక్‌తో పాటు దామోదర రాకకోసం వేచి చూశారు. మంత్రి దామోదర ఆలస్యంగా రావడంపై ఇన్చార్జి మంత్రి వివేక్ అసహానానికి గురైనప్పటికీ, దానిని బయటకు వ్యక్తం చేయలేదు. తీరా ఉదయం 11.30 గంటలకు మంత్రి దామోదర రాజనర్సింహా సంగారెడ్డి ఇన్స్పెక్షన్ బంగ్లాకు చేరుకున్నారు. వచ్చిన వెంటనే ఇన్చార్జి మంత్రి వివేక్, ఎంపీ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇద్దరు మంత్రులు పాల్గొన్నారు. మంత్రి దామోదర తనను గంటన్నరపాటు ఐబీలో వేచిచూసేలా చేయడంపై ఇన్చార్జి మంత్రి వివేక్ జిల్లా కాంగ్రెస్ నాయకుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ జిల్లా మంత్రి దామోదరను ఇలాగే గంటన్నరకుపైగా వేచి ఉండేలా చేశారని, అందుకు బదులుగానే మంత్రి దామోదర గురువారం ఆలస్యంగా వచ్చారని పార్టీ నాయకులు అంటున్నారు. ఏప్రిల్‌లో పటాన్చెరు మార్కెట్‌యార్డు కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి దామోదర రాజనర్సింహా, ఇన్చార్జి మంత్రి వివేక్ ఇద్దరు హాజరు కావాల్సి ఉంది. ఇన్చార్జి మంత్రి వివేక్ రాక కోసం మంత్రి దామోదర హైదరాబాద్‌లో తన నివాసం వద్ద గంటన్నరకుపైగా వేచి చూసినట్లు సమాచారం.

అయినా ఇన్చార్జి మంత్రి వివేక్ రాకపోవడంతో దామోదర్ రాజనర్సింహా ఒక్కరే పటాన్చెరు మార్కెట్‌యార్డు కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి దామోదర వెళ్లిన కొద్దిసేపటికే ఇన్చార్జి మంత్రి వివేక్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఇన్చార్జి మంత్రి వివేక్ తీరుపై జిల్లా మంత్రి దామోదర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. నాడు తనను వేచి ఉండేలా చేసి అవమానించిన ఇన్చార్జి మంత్రి వివేక్‌కు అదే రీతిలో సమాధానం ఇవ్వాలనే మంత్రి దామోదర గురువారం సంగారెడ్డి కార్యక్రమానిక గంటన్నర ఆలస్యంగా వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మంత్రి దామోదర, మంత్రి వివేక్ ఇద్దరు నారాయణఖేడ్‌లో ఒకేసారి పర్యటించినప్పటికీ ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరుకాలేదు. ఇది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మంత్రి దామోదర గురువారం మధ్యాహ్నం కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో పర్యటించి, పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు ఇన్చార్జి మంత్రి వివేక్ దూరంగా ఉన్నారు. ఇన్చార్జి మంత్రి వివేక్ నారాయణఖేడ్‌లో ఏటీసీ సెంటర్‌కు శంకుస్థాపన చేయగా, ఆ కార్యక్రమానికి దామోదర దూరంగా ఉన్నారు. పక్కపక్క మండలాల్లో కార్యక్రమాలు జరిగినా, ఇద్దరు ఒకరి కార్యక్రమాల్లో ఒకరు పాల్గొనలేదు. జహీరాబాద్‌లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలకు వివేక్ హాజరు కాగా, జిల్లా మంత్రి దామోదర దూరంగా ఉన్నారు. ప్రభుత్వం, పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో ఇద్దరు మంత్రులు ఒకే వేదిక పంచుకోవడం లేదు. ఇటీవల సంగారెడ్డిలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి ఇన్చార్జి మంత్రి వివేక్ దూరంగా ఉండడం పార్టీలో చర్చనీయాంశమైంది.
సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మెదక్ ఎంపీ రఘునందన్‌కు అధికారులు ఆహ్వానం పలకకక పోవడంతో అధికారుల తీరుపై వారిద్దరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రొటోకాల్ పాటించడం లేదని ఆయన ఆరోపించారు. ఇటీవలే సంగారెడ్డిలో టీయూఎఫ్ఐడీసీ ఇతర అభివృద్ధి పనులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సైతం ప్రొటోకాల్ ప్రకారం అధికారులు తనను ఆహ్వానించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇదే రీతిలో వ్యవహరిస్తే ప్రొటోకాల్ విషయంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎంపీ రఘునందన్ సైతం ప్రొటోకాల్ పాటించని అధికారులకు నోటీసులు ఇప్పిస్తామని హెచ్చరించారు.