దుబ్బాక, జూన్ 20: తొలిసారిగా సిద్దిపేట జిల్లా దుబ్బాకకు వచ్చిన మంత్రి వివేక్‌కు నిరసనలు వెల్లువెత్తాయి. దుబ్బాక పట్టణంలోని రజినీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో శుక్రవారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫొటో చిన్నగా పెట్టారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్, జిల్లా అదనపు కలెక్టర్‌ను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు.
ఆనంతరం కార్యక్రమానికి వచ్చిన మంత్రి వివేక్‌కు ఎమ్మెల్యే స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రి వెంట వేదికపైకి కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి వచ్చారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ప్రొటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. ప్రొటోకాల్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్యే సూచించారు. మంత్రి వివేక్ జోక్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు పనిగట్టుకుని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల నినాదాలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. కలెక్టర్ హైమావతి కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించాలని సూచించారు.
ఈ విషయంలో మంత్రి వివేక్ సొంత పార్టీ కాంగ్రెస్ నాయకుల తీరుపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో ఆరువేల మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరుగ్యారెంటీలు అమలు కావడం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు రూ. 6లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.