‘ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వ విధానాలు ఉంటాయి. బాలికలు, విద్యార్థులు ఇక నుంచి బస్‌పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్‌పాస్‌లను అందిస్తాం’.. అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఆయన మార్నింగ్ వాక్ చేశారు. సిద్దిపేట మోడల్ బస్టాండ్‌ను సందర్శించారు. మహిళా ప్రయాణికులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకంపై పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు మహిళలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
సిద్దిపేట, డిసెంబర్ 13 : ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వ విధానాలు ఉంటాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో మార్నింగ్ వాక్ చేసి వాక ర్లు, ప్రజలతో మాట్లాడారు. అనంతరం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వం నడుస్తున్నదని, తమ అభిప్రాయాలను నేరుగా తెలియజేయాలన్నారు. కలెక్టర్‌లో కలెక్టర్ సమక్షంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజాభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఏడాదిలోగా కాం గ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. రాజాసిం గ్‌కు ఏమైనా జ్యోతిష్యం తెలుసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు పూర్తి స్వేచ్ఛతో తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు. మంత్రి వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, హరికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రావు, నాగరాజు, అత్తు ఇమామ్ పాల్గొన్నారు.
సిద్దిపేట టౌన్, డిసెంబర్ 13: సిద్దిపేట మోడల్ బస్టాండ్‌ను బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు, విద్యార్థులు బస్‌పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించిందని చెప్పారు. బస్సులో ప్రయాణికుల పక్కనే కూర్చొని మహాలక్ష్మీ పథకం ఎలా ఉందని వాకబు చేశారు. ఉచిత బస్సు సదుపాయంతో నెలకొన్న సందిగ్ధతను పూర్తిగా తొలిగించాలని, పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు మహిళలు మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి వెంట కాం గ్రెస్ నేతలు ఉన్నారు.