హుస్నాబాద్, జనవరి 5: హుస్నాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులతో పాటు పలు వార్డుల్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, పలు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, రైతు బజార్, నూతన గోదాంలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ఎకరానికి రూ.12వేల రైతుభరోసా, వ్యవసాయ భూమిలేని రైతుకూలీలకు ఏటా రూ.12వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.
విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జనవరి 26నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. హుస్నాబాద్‌లో అవసరమైన అభివృద్ధి పనులను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. ఇంకా ఏంకావాలో పట్టణ ప్రముఖులు, మేధావులు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఎల్లమ్మ చెరువును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి ఎల్లమ్మ చెరువుకు లింక్ కెనాల్ ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం ఇందులో నీళ్లుండేలా పనులు చేపటనున్నట్లు మంత్రి తెలిపారు.
హుస్నాబాద్‌లోని తెలంగాణ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. గురుకులంలోని విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడి కొత్త మెనూ అమలు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని అందులో రాణించాలని, ముఖ్యంగా సైన్స్, ఇన్నోవేషన్‌లో ప్రతిభను కనబర్చాలని విద్యార్థులకు సూచించారు. గురుకులాన్ని డిగ్రీవరకు అప్‌గ్రేడ్ చేయాలని విద్యార్థులు కోరగా, అందుకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారితో మాట్లాడారు.
అనంతరం పట్టణంలోని ప్రీమెట్రిక్ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అంతకుముందు 1989-90ఎస్ఎస్సీ బ్యాచ్ వారు అందించిన ఫ్రీజర్ శవపేటికను మున్సిపల్‌కు అందజేశారు. యాదవ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన అనంతరం గొర్రెపిల్లను ఎత్తుకొని డోలు వాయించారు.కార్యక్రమాల్లో సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.