సిద్దిపేట, నవంబర్ 28: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కేసీఆర్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణంలోని మైదానంతోపాటు వంట గది, బాత్ రూములు, పిల్లల కోసం చేస్తున్న వంటలను పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించనున్న అన్నం, కూరలను పరిశీలించి నాణ్యత లోపం లేకుండా చూసుకోవాలని, ఆహార పదార్థాల్లో నాణ్యత లోటు ఉంటే చర్యలు తప్పవన్నారు.
విద్యార్థులతో మాట్లాడుతూ బోధన ఎలా ఉందని, ఎలాంటి ఆహారం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారా అని ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రిన్సిపాల్, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి పరిషరించుకోవాలన్నారు. సీఎం సూచనల మేరకు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వెల్ఫేర్ అధికారులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. మండలస్థాయిలో డీఎంహెచ్‌వో, డీపీవో, డీఆర్డీవో, పంచాయతీ సెక్రెటరీలను సభ్యులుగా వేసి కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కమిటీలు పాఠశాలలు సందర్శించి నివేదిక రూపొందిస్తాయని చెప్పారు. ఎకడా ఫుడ్ పాయిజన్‌కు అవకాశం లేకుండా పాఠశాల ఆవరణంతోపాటు వంటగదులను కూడా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం డైట్ అండ్ కాస్మోటిక్ చార్జీలను పెంచిందని, విద్యార్థులకు అందించి మెనూ మార్చాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు, విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు ధైర్యం ఇచ్చి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ చార్జీలు చెల్లిస్తామన్నారు. విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు అన్ని రకమైన కిట్లు అందిస్తున్నామని, సమస్యలపైన ప్రభుత్వానికి సూచనలు చేయాలని సూచించారు.