హుస్నాబాద్, మార్చి 14: కుమ్మరి కుటుంబంలో జన్మించి సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవయిత్రి మొల్లమాంబ మహిళా లోకానికి ఆదర్శం అని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు రూపొందించిన మొల్లమాంబ క్యాలెండర్‌ను హుస్నాబాద్‌లోని తన నివాసంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు అంటే తెలియని రోజుల్లోనే పట్టుదలతో చదివి రామాయణాన్ని అనువదించిన ఘనత మొల్లమాంబదేనన్నారు.
ఆమె చేసిన సేవలు తరాలు మారినా చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. మొల్లమాంబ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు, ఉపాధ్యక్షుడు, కుమ్మర సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు టీకే శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మర సంఘం నాయకుడు మల్లెల రామనాథ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నార్లపురం చంద్రమౌళి, హుస్నాబాద్ సంఘం నాయకులు నమిలికొండ రాజయ్య, బెక్కంటి భీమయ్య, నమిలికొండ అయిలయ్య, రాదారపు శ్రీనివాస్, జగదీశ్వర్, ఇటికాల స్వామి, ఇటికాల మొండయ్య, మహేందర్, ఎల్లయ్య, యాదగిరి, తిరుమలేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.