చేర్యాల, నవంబర్ 17: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి జాతర, కల్యాణోత్సవం వాల్‌పోస్టర్లను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అధికారులతో కలిసి మంత్రి రిలీజ్ చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్‌తో పాటు జిల్లా స్ధాయి ప్రభుత్వ అధికారులు, ఆలయ డీసీ టంకశాల వెంకటేశ్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రివ్యూ సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. గతేడాది జాతర, కల్యాణం సమయంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్, విద్యుత్, వైద్యారోగ్యం, ఆర్టీసీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, ఆర్అండ్బీ శాఖల అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్నిశాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. అమ్మవార్ల బంగారు కిరీటాల తయారీ నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేయించాలన్నారు. జాతర జరుగుతున్న రోజుల్లో కళాబృందాలతో ఒగ్గు కథ వంటి జానపద కళారూపాలు ప్రదర్శించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆలయాన్ని దేదీప్యమానంగా ముస్తాబు చేయాలని, సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ సంపూర్ణంగా నిషేధించాలన్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఆలయ ఆవరణలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాల మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
మంత్రి కొండా సురేఖ అక్క మల్లన్నస్వామి భక్తురాలు అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జాతర జరిగినన్ని రోజులు చేర్యాలతో పాటు దగ్గరలోని దవాఖానల వైద్యసిబ్బందితో వైద్యం అందించాలని కోరారు. ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం కృషిచేయాలని కోరారు. జాతర ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్ నుంచి వీడియా కాన్ఫరెన్స్‌లో అదనపు డీసీసీ కుషాల్కర్, ఆర్డీవో సదానందం, ఏసీపీ సదానందం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌మూర్తి, డీపీవో విజయ్‌కుమార్, విద్యుత్ ఎస్ఈ చంద్రమౌళి, ఆర్అండ్బీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.