మెదక్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగధనుల అమరత్వమేనని, ఆ మహనీయుల స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించేతత్వం అలవడిందన్నారు.
ఆమె స్ఫూర్తిని భవిష్యత్తుతరాలకు అందించాలనే సంకల్పం తో కోఠిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, యాదవరెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
వనమహోత్సవంలో నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని అటవీ, దేవాదాయ, ధర్మాదాయ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వన మహోత్సవంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నారు. పచ్చటి మొక్కలతో భవిష్యత్తు తరాలకు భరోసా వస్తుందన్నారు.