మెదక్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మెదక్‌ను ఎకో టూరిజం, టెంపుల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, పది నెలల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ కలెక్టరేట్లో గురువారం మెదక్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రూ.12 వేల కోట్లు అందించామన్నారు. త్వరలో రేషన్, ఆరోగ్య తరహాలో డిజిటల్ కార్డులు అందించాలని ప్రభుత్వ నిర్ణయించిందని పేరొన్నారు. రైతులకు పంట నష్టం నిధులు త్వర లో అందిస్తామన్నారు. జిల్లాను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని, ప్రజా సమస్యలు పరిషరించిన అధికారులను ప్రోత్సహించాలన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. నూతన మెడికల్ కాలేజీలో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు న్యాయం చేయాలని, ధాన్యం కొనుగోలులో సరైన పద్ధతులు పాటించాలన్నారు. ఏడుపాయల్లో రెగ్యులర్ ఈవోను నియమించాలని మంత్రిని కోరారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ హరితహారంలో మొక్కలను సరిగా పెంచాలని, వడియారం అటవీని టూరిస్ట్ ప్రదేశంగా అభివృద్ధి చేయాలని, నర్సాపూర్ ప్రాంతంలో కోతులు అడవి దాటకుండా పండ్ల చెట్లను పెంచాలని, రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేయాలన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడు తూ రైతులకు కరెంటు సమస్యలు పరిష్కరించాలని, ఏడుపాయల జాతరను రూ. వంద కోట్లతో ఎకో టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పీహెచ్సీ సబ్ సెంటర్లకు వేయాన్ని పెంచాలన్నారు. చేగుంటలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు పంటనష్టం కాకుండా చూడాలని, ధరణిలో పెండింగులో ఉన్న కేసులు పరిషరించాలని కోరారు.