పటాన్చెరు, నవంబర్ 6: బీసీ గణన చారిత్రాత్మక నిర్ణయం అని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లో బుధవారం సమగ్ర ఇంటింటి సర్వేను ఆమె ప్రారంభించారు. గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఇంటింటికీ తిరిగి గుర్తింపు స్టిక్కర్ అంటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే- బీసీ కులగణన దేశానికే ఆదర్శం అన్నారు.
ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. సమగ్ర ఇంటింటి సర్వేతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలకు అన్నిరంగాల్లో ప్రాధాన్యత లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ కులగణనతో బీసీలకు రాజకీయాల్లో అవకాశాలు పెరుగుతాయన్నారు. విద్య, ఉపాధి, ఇతర రంగాల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. బ్రిటిష్ కాలంలో 1931లో జరిగిన కులగణన తరువాత దేశంలో మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే ఇంటింటి సమగ్ర సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధుముదిరాజ్ మాట్లాడుతూ.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తన సొంత గ్రామం చిట్కుల్ నుంచి ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. బీసీ గణనతో బీసీల లెక్క తేలుతుందన్నారు. మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. కాగా, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ మరో నాయకుడు కాట శ్రీనివాస్‌గౌడ్ సైతం ఈ సమావేశానికి రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి, నీలం మధుముదిరాజ్, కాట శ్రీనివాస్‌గౌడ్ పోటీచేశారు. ఇప్పుడు ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నా వారి మధ్య దూరం తగ్గడం లేదు. ముగ్గురు నాయకులను ఒకే వేదికపై చూసే భాగ్యం కాంగ్రెస్ శ్రేణులకు ఉంటుందా.? అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. గైర్హాజరు కావడం గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయా.? అనే ప్రశ్నను లేవనెత్తింది.