ప్రభుత్వ బడుల్లో చేరి ఖర్చు తగ్గించండి..
రెండు నెలల్లో కొత్త పింఛన్లు
ధరణితో రైతుల భూములకు పక్కా భద్రత
వైద్య,ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు
అల్లాదుర్గం, జూన్ 20 : కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులను మారుస్తామని వైద్య,ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం అల్లాదుర్గంలో రూ.2.50కోట్లతో నిర్మించిన జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూలీ పనులు చేసుకునే పేద పిల్లలకు కూడా ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువు అందివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంగా మార్చుతుందన్నారు. విద్యను బలోపేతం చేయడం కోసం ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా రూ.7,300 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా మారాయని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ఖర్చును తగ్గించుకోవాలని తల్లిండ్రులకు సూచించారు.
మరణించిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలిగిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డు, పింఛన్లను మంజూరు చేస్తామని అన్నారు. కర్ణాటకలో రూ. 500 పింఛన్ ఇస్తే, మనం రూ.2016 ఇస్తున్నామన్నారు. ధరణి రావడానికి మందు జరిగిన చిన్న,చిన్న తప్పిదాల వల్ల కొంత ఇబ్బందిగా మారిందని, ధరణిలో పోర్టల్‌లో 95 శాతం మందికి ప్రయోజనం కలిగిందని, 5శాతం మందికి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. వచ్చే రెండు నెలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, ఇందులో కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారులకు వరుకు ఇంటింటికీ తిరిగి ధరణి సమస్యలను పరిష్కరిస్తాని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. గతంలో జిల్లాకు ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఉంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గానికి ఒక రెసిడెన్సియల్ను ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలోని ప్రజలకు అత్యున్నత వైద్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలోఎంపీ బీబీపాటిల్,ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్ శ్రీధర్‌రెడ్డి,ఎంపీపీ అనిల్‌కుమార్ రెడ్డి,జడ్పీటీసీ సౌందర్య,టీఏసీ మెంబర్ కాశీనాథ్,ఆర్డీవో సాయిరాం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భిక్షపతి,టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లెగడ్డ నర్సింహులు, సర్పంచ్ అంజియావ్,ఎంపీటీసీ దశరథ్ పాల్గొన్నారు.