శాంతిభద్రతల్లో దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో కలెక్టర్ శరత్‌కుమార్ ఆధ్వర్యంలో సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 9 మండలాలు,190 పంచాయతీలను ఏర్పాటు చేసి పాలన ప్రజల దరికి చేర్చామని తెలిపారు.
పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అభ్యర్థన మేరకు రిజిస్ట్రార్ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామన్నారు. ధరణి పోర్టల్‌తో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దివ్యాంగులకు పింఛన్ పెంచడాన్ని హర్షిస్తూ హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్, వికలాంగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు రామచంద్రాపురం డివిజన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొల్లూరు పోలీసు స్టేషన్‌ను ప్రారంభించారు. గ్రామంలో నిర్మిస్తున్న బీరప్పలు, మల్లికార్జునస్వామి, విశ్వకర్మల ఆలయాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
– సంగారెడ్డి/ రామచంద్రాపురం, జూన్ 10
సంగారెడ్డి, జూన్ 10: శాంతిభద్రతల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లాకేంద్రంలో శనివారం సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. స్థానిక మల్కాపూర్ చౌరస్తాలోని గోకుల్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ శరత్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగుల పింఛన్ రూ.3116 నుంచి రూ.4116కు పెంచిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి మంత్రితోపాటు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు దివ్యాంగులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సుపరిపాలన దినోత్సవాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాలోని ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. తెలంగాణ వస్తే ఆగమైతదని, విద్యుత్ లేక దీపాలే దిక్కని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని విమర్శలు చేసిన నాయకుల కండ్లు తెరుచుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించారన్నారు. కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు దూరం…
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు భూముల సమస్యలు తలెత్తకుండా ఒకే పోర్టల్ ద్వారా అన్ని రకాల సేవలు అందించేలా ధరణిని తీసుకువచ్చారని మంత్రి గుర్తు చేశారు. గతంలో ఒక రైతు పేరు నుంచి మరో రైతుకు భూములను మార్చిన అధికారులు వీఆర్వోల నుంచి కలెక్టర్ స్థాయి దాకా ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి అవినీతికి తావు లేకుండా ఒకే పోర్టల్ ఏర్పాటు చేయడం ద్వారా ఆన్లైన్ డిజిటల్ వాడకంలో రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి మాటల మనిషి కాదని, అనుకున్నది చేసి చూపించే నైజం ఉన్న గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు.
కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ పెంచి మరో నూతన శకానికి నాంది పలికారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతు చనిపోతే బాధిత కుటుంబం ఆర్థిక సహాయం కోసం ఏడాదిపాటు తిరిగేదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సహజ మరణాలకు రూ.5 లక్షలు వారం రోజుల్లో అందిస్తున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆపద్బంధు దరఖాస్తులను సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చి పరిశీలించి త్వరగా మంజూరు చేయాలని కోరిన సందర్భాలెన్నో ఉన్నాయని గుర్తు చేశారు. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులకు పరుగులు పెడుతున్నారని, తెలంగాణ టీపాస్, ఐపాస్ విధానంతో తక్కువ సమయంలో పారిశ్రామికవేత్తలకు అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారని ఒక పారిశ్రామికవేత్త సభలో వివరించిన విషయం తెలిసిందేనన్నారు.
ధరణి సమస్యలు 20 రోజుల్లో పరిష్కరిస్తాం: కలెక్టర్
ధరణి పోర్టల్‌లో వచ్చిన లక్షా 28 వేల 108 దరఖాస్తులను పరిశీలించి సాధ్యమైనవాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ శరత్‌కుమార్ వెల్లడించారు. పెండింగ్ దరఖాస్తులను 15-20 రోజుల్లో పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామన్నారు. దళితబంధు పథకంలో జిల్లాలో 444 మందిని ఎంపిక చేశామని, అందరికీ ఎంచుకున్న పథకాన్ని అందజేసి అధికారుల పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్‌లు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.