చిన్నకోడూరు, మార్చి 28 : మూడేండ్ల నుంచి చెరువులు, కుంటలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. యాసంగిలో పొలాలు ఎండకుండా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు రైతులకు భరోసా కల్పించారు. ఎండకాలం సమీపించడంతో బోరు బావుల్లో భూగర్భజలాలు తక్కువ ఉన్నాయని రైతులు మంత్రి హరీశ్‌రావుకు విజ్ఞప్తి చేసిన వెంటనే సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రంగనాయకసాగర్ లెఫ్ట్ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో అన్ని గ్రామా ల్లో చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం మాదిరి కాల్వల్లో గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. పల్లెల్లో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి.
రంగనాయక సాగర్ లెఫ్ట్ కెనాల్‌కు మూడు సార్లు నీటి విడుదల
మంత్రి హరీశ్‌రావు రంగనాయకసాగర్ లెఫ్ట్ కెనాల్‌కు మూడు సార్లు గోదావరి జలాలు విడుదల చేశారు. చిన్నకోడూరు మండలంలో మొత్తం 248 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఈ యాసంగిలో చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేశారు. మాచాపూర్-చింతల్‌చెరువు, మైలారం-అవుసులోనికుంట, కమ్మర్లపల్లి-కొడిశెలకుంట, చౌడారంలో జాయింట్ ఫార్మర్స్ సొసైటీ ఎస్సీ కుంట, వడ్లబాలమణికుంట, కుమ్మరికుంట, గాడిచర్లపల్లికుంట, విఠలాపూర్‌లో అనంతమ్మకుంట చెరు వు, రేగులకుంట, సంజీవరెడ్డికుంట, గంగాపూర్‌లో చావుటినర్సయ్యకుంట, బుస్స ఎల్లయ్యకుంట మత్తళ్లు దుంకుతున్నాయి. సలెంద్రి, మైలారం, కమ్మర్లపల్లి, చౌడారం, మాచాపూ ర్, విఠలాపూర్, మేడిపల్లి గ్రామాల్లో 28 చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
గతంలో దేవుడిని నమ్ముకొని పెట్టుబడులు పెట్టి పంటలుసాగుచేసేవాళ్లం. ఎందుకంటే పంట చేతికి వచ్చే టైంలో ఎండిపోతుంటే ఇబ్బందులు పడేది. మరో విషయం ఏమిటంటే వచ్చి పోయే కరెంట్‌కు ఒకమడి పారితే మరోమడి ఎండిపోయేది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు రైతుల ఇబ్బందులు తెలుసుకాబట్టి కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు, కుంటలు నింపుతున్నారు. రైతుల బాధ తెలిసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– బాలెంలా వెంకట్‌రెడ్డి, రైతు, విఠలాపూర్
నీళ్లు చూస్తే పంట పండినంత సంతోషం
ఇది వరకు కాలం అయితేనే రైతులు పంటలు సాగుచేసేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ పొలాలు ఎండిపోలేదు. సీఎం కేసీఆర్ సారు పుణ్యమా అని మూడేండ్ల నుంచి అన్ని రకాల పంటలు సాగుచేసుకుంటున్నాం. ఎండకాలంలో కూడా గోదావరి నీళ్లు ఇచ్చి రైతులకు కొండం త ధైర్యం కల్పించారు. కాల్వ ద్వారా నీళ్లు వదిలి చెరువులు,కుంటలు నింపుతుండ్రు. కాల్వలో పారుతున్న నీళ్లను చూస్తుంటే పంట పండినంత సంతోషం అనిపిస్తుంది.
– దర్శనం పర్సయ్య, రైతు, చిన్నకోడూరు
రందిలేకుండా పంటలు పండుతున్నాయి
కాల్వల ద్వారా చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపారు. బోరు బావుల్లో భూగర్భజలాలు పెరిగాయి. చెరువులకు నీళ్లు ఇవ్వకుంటే ఇప్పటికే వరి పొలాలు సగం వరకు ఎండిపోయేవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పొలాలను పారించుకుంటున్నాం. వరి పంటలు ఎండి పోతాయన్న రంది లేదు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటాం.
– జీకురు ఎల్లయ్య, రైతు, పెద్దకోడూరు