మెదక్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): “సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్‌కు రానున్నారు.” అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలో సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఘన స్వాగతం పలకనున్నారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి పటాన్చెరు, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు మెదక్‌కు చేరుకుంటారన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, 1.20 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం, 1.40 గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని వివరించారు.
మెదక్ వేదికగా కేసీఆర్ ప్రగతి శంఖారావం…
మెదక్ వేదికగా బుధవారం సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని పూరించనున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ రెండు కొత్త పథకాలను ప్రారంభించి, దివ్యాంగులకు పెంచిన రూ.4,016 పింఛన్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపా రు. ఆ తర్వాత దేశంలోని 16 రాష్ర్టాల్లో బీడీలు చేసే కార్మికులు ఉన్నా, ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నారన్నారు. బీడీ కార్మికులతోపాటు టేకేదారులు, ప్యాకర్లు తాము కూడా వృత్తిలో ఉన్నామని మాకు కూడా పింఛన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం తో వారికి కూడా ముఖ్యమంత్రి మెదక్ వేదికగా పింఛన్లు అందజేయనున్నారని వివరించారు. ది వ్యాంగులకు సంబంధించిన రూ.4,016 పింఛన్లును సీఎం కేసీఆర్ మెదక్‌లో అందించగా, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు దివ్యాంగులకు పింఛన్లను అందించే కార్యక్రమం ఏకకాలంలో జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదున్నర లక్షల మంది ది వ్యాంగులకు ఇది వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులనుద్ధేశించి మాట్లాడుతారు. అనంతరం భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకుంటారని, ఆ తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరివెళ్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.