సిద్దిపేట వాసుల దశాబ్దాల రైల్వే కల సాకారం కానున్నది. ఈనెలాఖరు వరకు సిద్దిపేట రైల్వేస్టేషన్లో రైలు కూత వినపడేలా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని రంగాధాంపల్లి శివారు వరకు రైలు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, ఆర్థిక,వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ, భూసేకరణ, ఇతర సమస్యలపై ఎప్పటికప్పడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పనులు పూర్తి కానున్నాయి. ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మీదుగా దుద్దెడ వరకు రైల్వే సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. జిల్లాలో 83.40 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం చేయనుండగా ఇప్పటివరకు 65 కిలోమీటర్లకుపైగా పనులు పూర్తి చేశారు. త్వరలోనే దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు రైల్వేసేఫ్టీ అధికారులు రైల్వేట్రాక్‌ను పరిశీలించనున్నారు. త్వరలోనే రైలు రానుండడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా కేంద్రమైన సిద్దిపేట శివారులోని నర్సాపూర్, కేసీఆర్ నగర్ కాలనీ సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణమవుతుంది. ఇక్కడ ట్రాక్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల సిద్దిపేట-హనుమకొండ రహదారి రంగధాంపల్లి శివారు వరకు రైల్వే సామగ్రితో రైలు వచ్చింది. అక్కడి నుంచి సిద్దిపేట రైల్వేస్టేషన్ వరకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిధిలో సీసీ, ర్యాక్, మెట్లు, కార్యాలయం, తదితర పనులతోపాటు ఐదు వరుసల ట్రాక్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగతున్నాయి. ఈ ఐదు ట్రాక్ లైన్లలో మూడు లైన్లలో ప్యాసింజర్ రైళ్లు, 4వ లైనులో గూడ్స్ రైళ్లు, 5వ లైన్లో ప్యాకింగ్, మరమ్మత్తులు, ఇంజన్ల సైడింగ్ కోసం వినియోగించనున్నారు. ఇక్కడనే గూడ్స్ షెడ్ నిర్మాణం కూడా చేస్తున్నారు. ఈనెలఖారు వరకు సిద్దిపేట రైల్వేస్టెషన్ వరకు రైల్ నడిచేలా యుద్ధప్రాతిపదికన పనులు ముమ్మరం చేశారు. తొలిదశలో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి నాచారం, బేగంపేట, అప్పాయిపల్లి, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ వరకు రైల్ నడపడానికి రైల్వే సేప్టీఅధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్నటికే హైదరాబాద్ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ వరకు రైలు సేవలు ప్రారంభమై రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడి రైల్వే రేక్ పాయింట్‌కు ఎరువులను తీసుకొచ్చి జిల్లాలోని అన్ని ప్రాంతాల రైతులకు ఎరువులను సరఫరా చేస్తున్నారు. దీంతో ఎరువులను తీసుకురావడానికి సనత్‌నగర్ రేక్ పాయింట్‌కు వెళ్లాల్సిన శ్రమ తగ్గింది. సిద్దిపేట నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్ వరకు రెగ్యులర్ రైలు నడపనున్నారు. దీనితోపాటు తిరుపతి, బెంగళూరు ప్రాంతాలకు రైలు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
నాలుగు జిల్లాల్లో 151.36 కిలోమీటర్ల రైల్వేలైన్
సికింద్రాబాద్-మన్మాడ్ వెళ్లే మార్గంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి రైల్వేలైన్ ప్రారంభమై సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేటల మీదుగా రాజన్నసిరిసిల్లలోని సిరిసిల్ల, వేములవాడ, బోయినిపల్లి మీదుగా కరీంనగర్ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి-నిజామా బాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద ఈ లైన్ కలుస్తుంది. ఈ రైల్వేలైన్ పొడవు 151.36 కిలోమీటర్లు ఉంటుంది. రూ.1160.47 కోట్ల అంచనాతో పనులను ప్రతిపాదించారు. రైల్వేలైన్ నిర్మాణానికి సుమారుగా 2,200 ఎకరాల భూమి అవసరం ఉండగా సిద్దిపేట జిల్లాలో పూర్తి స్థాయిలో భూసేకరణ పూర్తి చేసి రైల్వేశాఖకు అప్పగించారు. నాలుగైదు దశల్లో పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి పనులను ముమ్మరం చేశారు. ఈ రైల్వేలైన్ నిర్మాణం మెదక్ జిల్లాలో 9.30 కి.మీటర్లు, సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీటర్లు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37.80 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లా లో 20.86 కిలోమీటర్ల మేర మొత్తం 151.36 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం చేస్తారు. నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వేస్టేషన్లు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు.
సమైక్య రాష్ట్రంలో కాగితాలకే పరిమితం
సమైక్య రాష్ట్రంలో మనోహరాబాద్- కొత్తపల్లి రైలు మార్గం కాగితాలకే పరిమితమైంది. అప్పటి ఆంధ్రా పాలకులు రాష్ట్రం వాటాను చెల్లించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతోపాటు ఉద్యమ నేతనే ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణ ప్రజల కోరికలు ఒక్కోక్కటిగా నేరవేరుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయిస్తున్నారు. రాష్ట్రం వాటాను చెల్లించడంతోపాటు రైల్వే లైన్ నిర్మాణ పనులకు కావాల్సిన భూసేకరణ చేసి ఇవ్వడంతో శరవేగంగా మనోహరాబాద్ -కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణ పనులు జరుగతున్నాయి. 2005 -2006లో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మూలధనం వాటాగా మొత్తం ఖర్చు భరించి భూసేకరణ, రైల్వే ఏర్పాటుకు అవసరమైన నిధులలో మూడోవంతు సమకూర్చడం, రైల్వే నిర్మాణం అనంతరం 5 సంవత్సరాలపాటు రైల్వేకు వచ్చే నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం భరించడం అనే అగ్రిమెంట్‌తో మనోహరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కొత్తపల్లి కరీంనగర్ వరకు 151 కిలోమీటర్ల రైల్వేలైన్ మంజూరు చేయించారు. అప్పట్లో రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం వాటాగా చెల్లించాల్సిన నిధులు చెల్లించకపోవడం, భూసేకరణ చేయకపోవడం మూలంగా 2014 వరకు రైల్వే ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. 2014లో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేసీఆర్ మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వేలైన్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు మంజూరు చేసి భూసేకరణ చేయడంతో రైల్వే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వేగంగా రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి.
రైల్వే సౌకర్యంతో మరింతగా అభివృద్ధి
దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ప్రజల కల సాకారం కానుండడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. రైల్వే సౌకర్యం ఏర్పాటుకానుండడంతో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధికానుంది. ఎంతోమంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలు పెద్దఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నిర్మించే రైల్వేలైన్ పెద్దపల్లి వద్ద కలుస్తుంది. దీంతో కలకత్తా, న్యూఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది. మనోహరాబాద్ నుంచి ముంబా యి తదితర ప్రాంతాలకు కూడా వెళ్లవచ్చు. ఈ రైల్వేలైన్ నిర్మాణంతో మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ప్రధాన పుణ్యక్షేత్రాలను కలిపే రైల్వేలైన్ అని చెప్పవచ్చు. వేములవాడ రాజన్న, కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలు ఉన్నాయి. గజ్వేల్ ప్రాంతంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. కాలుష్యరహిత పరిశ్రమలు నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇదిలాఉంటే సిద్దిపేట జిల్లాలో పెద్దఎత్తున రిజర్వాయర్ల నిర్మాణాలు జరిగాయి. భవిష్యత్తులో మంచి పర్యాటక ప్రాంతం కానున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో కొండపోచమ్మ రిజర్వాయర్ ఉన్నది. ఇక్కడికి సుమారుగా 30 కి.మీ దూరంలో కొండపోచమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్కడి నుంచి మరో 25 కి.మీ దూరంలో భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్న ఆలయం ఉంది. ఇక్కడికి రా్రష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. మల్లన్నను దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మ ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వెళ్లవచ్చు. ఇక ఉత్తర తెలంగాణ వరప్రదాయినైన కొమురవెల్లి మల్లన్న రిజర్వాయర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మల్లన్న వనాల పేరుతో మంచి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నారు.
ఉత్తర తెలంగాణలో ఈ రైల్వేలైన్ కీలకం
మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున న్యూ బ్రాడ్‌గేజ్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రైల్వే ప్రాజెక్టుకు రూ.1160.47 కోట్లు ఖర్చు చేస్తారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ముఖ్యమైన రైల్వే రవాణా మార్గం ఇదే. ఈ రైల్వేలైన్‌లో గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. భవిష్యత్తులో ఈ లైన్ ఉత్తర దక్షిణాదిని ముఖ్యమైన రైల్వేమార్గంగా రూపుదిద్దుకుంటుంది. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు నిర్మాణం జరుగుతుంది. అక్కడి నుంచి పెద్దపల్లి లైన్‌కు అనుసంధానం అవుతుంది. దీని ఫలితంగా ఢిల్లీ, కలకత్తా తదితర మహానగరాలకు లింకు అవుతుంది. 2023-24 కేంద్ర బడ్జెట్లో మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్‌కు రూ.185 కోట్లు మాత్రమే కేటాయించింది. 2022-23 బడ్జెట్లో రూ 160 కోట్లు, 2021-22 బడ్జెట్లో రూ.325 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన వాటాగా రూ. 600 కోట్ల వరకు ఖర్చు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులను చేపడుతున్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 2025 వరకు పూర్తిచేయాలని గడువు ఉంది.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ
సిద్దిపేట జిల్లాకు రైల్వేకల సాకారమవడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైంది. ఈ ప్రాంత ప్రజల కలలు ఒక్కోక్కటిగా సాకారమయ్యాయి. జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు తెచ్చుకున్నాం. రైలు కూడా తెచ్చుకున్నాం. ఈ నెలాఖరు వరకు సిద్దిపేట రైల్వే స్టేషన్ పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. రైల్వే సౌకర్యం ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధికానుంది. ఎంతోమంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలు పెద్దఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి.
– తన్నీరు హరీశ్‌రావు,రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి