మాఇంటి ఆడబిడ్డ.. ఆమెను మరోసారి ఆశీర్వదించండి.. అని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్హాల్లో ఆదివారం జిల్లా మున్నూరు కాపు కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాగ్రెస్, బీజేపీలు ఎన్ని కుతంత్రాలు చేసినా మెదక్ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డి మూడోసారి గెలుపొందడం ఖాయమన్నారు. కుల సంఘాల భవనాలకు నిధులు అడిగితే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెకిలిగా నవ్వుతూ అవమానించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మున్నూరు కాపులను గుర్తించి, వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, మున్నూరు కాపు కులస్తులంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మున్నూరుకాపులు మాట ఇస్తే తప్పరని, ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి కోరారు.
మెదక్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాఇంటి ఆడబిడ్డ అని, ఆమెను మరోసారి ఆశీర్వదించండని మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం మెదక్ వెంకటేశ్వర ఫంక్షన్హాల్లో మెదక్ జిల్లా మున్నూరుకాపు అధ్యక్షుడు బట్టి ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో మున్నూరుకాపు కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. సభకు మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మెదక్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, మరోసారి ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. మున్నూరుకాపు ఓట్లతోనే పద్మాదేవేందర్‌రెడ్డి గెలుస్తుందని ధీమా వ్యకం చేశారు. మెదక్ జిల్లాలో ప్రభుత్వం రూ.కోటితో ఎకరం స్థలంలో మున్నూరుకాపు భవనానికి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని కుతంత్రాలు చేసినా మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు.
ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో మున్నూరుకాపు కులస్తులు ఉన్నారని, సీఎం కేసీఆర్ తెలంగాణలో వారిని రాజకీయంగా ఆదరించారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో మున్నూరుకాపులను ఏ పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుల సంఘాల భవనాలకు నిధులు అడిగితే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెకిలిగా నవ్వుతూ అవమానించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని కోకాపేట నడిబొడ్డున ఐదు ఎకరాల భూమిని మున్నూరుకాపులకు ఇచ్చారని, ఇప్పుడు దాని విలువ రూ.500 కోట్లు ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ కులానికి గౌరవం ఇచ్చారని, ఆయనకు రుణపడి ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మొదటి మేయర్ మున్నూరుకాపు ముద్దుబిడ్డ బొంతు రామ్మోహన్‌ను నియమించగా, రెండోసారి సైతంకూడా మేయర్‌ను మున్నురుకాపు బిడ్డకు ఇచ్చారని మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు. మంత్రి హోదాకు సమానమైన ఆర్టీసీ చైర్మన్ పదవిని సోమారపు సత్యనారాయణకు ఇచ్చారని, మంత్రి పదవులను జోగు రామన్నతో పాటు తనకూ ఇచ్చారని గుర్తుచేశారు. కాళేశ్వరం నీళ్లతో భూమికి బరువైన పంటలు పండిస్తున్నామని, వలసలు తక్కువై వ్యవసాయం ప్రాధాన్యత పెరిగిందన్నారు. రైతులు, ముఖ్యంగా మున్నూరూకాపులకు పరపతి పెరిగిందన్నారు. ఒకప్పటి పలసల తెలంగాణను ఊహించుకొని, ఇప్పటి తెలంగాణను చూస్తుంటే అద్భుతంగా ఉందన్నారు.
మున్నూరుకాపు కులస్తులు మాట ఇస్తే తప్పరని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మున్నూరుకాపుల సహకారం మరువలేనిదని తెలిపారు. సీఎం కేసీఆర్ మాట ఇచ్చిన ప్రకారం మెదక్ జిల్లాగా ప్రకటించారని పేరొన్నారు. ఇప్పుడు ఇక్కడే అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. మున్నూరుకాపు కులస్తులు మాట ఇస్తే తప్పరని, రానున్న ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని కోరారు. మెదక్ పట్టణంలో మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనానికి ఒక ఎకరం భూమితో పాటు రూ.కోటి నిధులు కేటాయించినట్లు పేరొన్నారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, ఉపాధ్యక్షుడు బట్టి జగపతి, కల్లూరి హన్మంత్‌రావు, దేమ యాదగిరి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకు లు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, డాక్టర్ శివ దయాళ్, ఎంపీపీలు సబిత, సిద్ధరాములు, కౌన్సిలర్లు ని ర్మల, చందన, ము న్నూరుకాపు కులస్తులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఏ కులానికి ఇవ్వని ప్రాధాన్యత మున్నూరుకాపు కులానికి ఇస్తున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మున్నూరుకాపు సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌కు మున్నూరు కాపులు అండగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 9 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులతోపాటు రెండు సార్లు ఆర్టీసీ చైర్మన్ పదవిని, జీహెచ్ఎంసీ మేయర్ పదవిని రెండుసార్లు మున్నూరుకాపు కులానికి ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ అడ్రస్ ఉండదని జోస్యం చెప్పారు. ఆ పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మితే మోసపోతామరన్నారు. మరో ఐదేండ్ల పాటు కేసీఆరే సీఎంగా ఉంటారని పిలుపునిచ్చారు.