నర్సాపూర్, నవంబర్ 4: త్వరలోనే నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ, ఎన్డీసీ, ట్రామా కేంద్రాలు ఏర్పా టు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి ఆయన రూ.50 లక్షలతో ఐదు పడకల సామర్థ్యంతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజావైద్యంపై నూతన పాలసీని అమలు చేస్తామన్నారు.
నూతన డయాలసిస్ సెంటర్‌తో 22 మంది రోగులకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. నర్సాపూర్ ఏరియా దవాఖాన పరిధిలో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు మధ్య 2లక్షల జనాభా ఉన్నదని గుర్తు చేశారు. మెదక్ జిల్లా దవాఖానలో సుమారు వంద మం దికి పైగా డయాలసిస్ రోగులు చికిత్స పొందుతున్నారన్నారు. వందమందిలో 22 మంది రోగులు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన వారిగా వివరించారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మొత్తం 22 మంది రోగులు ఉండగా ఇందులో నర్సాపూర్-7, కౌడిపల్లి-5, కొల్చారం-10 మంది రోగులు ఉన్నట్లు పేర్కొన్నారు.
వారానికి మూడుసార్లు 14మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. 22 మంది డయాలసిస్ రోగులే కాకుండా సంగారెడ్డి, నీమ్స్, మల్లారెడ్డి దవాఖాన, ప్రభుత్వ సర్వజన దవాఖానల్లో చికిత్స పొందుతున్నారన్నారు. త్వరలో నర్సాపూర్ ప్రాంతంలో ఐసీయూ, ఎన్డీసీ, ట్రామా అత్యవసర శాఖలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ పావనీ, తహసీల్దార్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది, కౌన్సిలర్లు, నాయకులు మల్లేశ్ గౌడ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.