పుల్కల్, సెప్టెంబర్ 5 : భారీ వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి సందర్శించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పూర్తిగా నిండింది. ప్రాజెక్టును సందర్శించిన మంత్రి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం ప్రాజెక్టు దిగువ బాగాన ఉన్న పార్క్ వరకు కాలినడకన వెళ్లి పరిశీలించారు.
పార్క్లో పర్యాటకులు పడుతున్న ఇబ్బందులను గ్రహించిన మంత్రి త్వరగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్క్ అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్కడే స్థానికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దుకాణాదారులతో మంత్రి ముచ్చటించారు. స్థానికులు మం త్రి దృష్టికి సమస్యలను తీసుకురాగా సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానన్నారు.
మీరు బాగా చదువుకోండి…మీకు అండగా నేనున్నాను…పాఠశాలలో మౌలిక సదుపాయాలను దగ్గరుండి కల్పిస్తానని మంత్రి దామోదర రాజనర్సింహ పుల్కల్ ఆదర్శ పాఠశాల విద్యార్థులకు భోరసానిచ్చారు. పుల్కల్ శివారులోని అదర్శ పాఠశాలను మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందుకు స్పందించిన మంత్రి విద్యార్థులతో మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా విద్యార్థులు చదువును నిలిపి వేయవద్దన్నారు. చదువుతోనే నేటి సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఆదర్శ పాఠశాలలో నెలకొన్న ప్రతి సమస్యనూ త్వరలోనే పరిష్కరిస్తానని విద్యార్థులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అధికారులు ఉన్నారు.