రామచంద్రాపురం, జూన్ 21: ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్‌లో రూ.8.5కోట్లతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మల్లేపల్లి లలితాసోమిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయ భవనాన్ని, రేడియల్ రోడ్డులో ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై లైట్లను ప్రారంభించారు.
అంతకుముందు తెల్లాపూర్ ముఖద్వారంలోని గద్దర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ భవనం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 105 అడుగుల జాతీయ పతాకాన్ని, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. రూ.2 కోట్లతో నిర్మించనున్న గద్దర్ ఆడిటోరియానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ప్రభు త్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. చెరువులు, కుంటల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నదన్నారు.
అనంతరం ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, కమిషనర్ సంగారెడ్డి, తహసీల్దార్ సంగ్రాంరెడ్డి, ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు బాబ్జీ శ్రీశైలం, నాగరాజు, భరత్, రాజు, రాంసింగ్, పావని, మయూరి, మంజుల, జ్యోతి, చిట్టి, కోఆప్షన్ సభ్యులు శ్రీపాల్‌రెడ్డి, జయలక్ష్మి, కార్పొరేటర్ పుష్పానగేశ్, అమీన్పూర్ చైర్మన్ పాండురంగారెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.