సంగారెడ్డి, జనవరి 3(నమస్తే తెలంగాణ): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంగారెడ్డి జిల్లా పర్యటనకు జిల్లా కు చెందిన కాంగ్రెస్ అగ్రనేతలు దామోదర రాజనర్సిం హ, జగ్గారెడ్డి దూరంగా ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇద్దరు రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు. ఇద్దరు నేతలు శుక్రవారం జరిగిన డిప్యూటీ సీఎం అధికార కార్యక్రమానికి గైర్హాజరు కావడం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతుందన్న ప్రచారం సాగుతున్నది. ఇద్దరు నేతలు డిప్యూటీ సీఎం జిల్లా పర్యటనకు డుమ్మా కొట్టడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్స్ వర్క్‌షాప్‌నకు డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా ఆయనను కలవడం ఆనవాయితీ. అయితే భట్టి విక్రమార్క పర్యటనకు జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెం ట్ జగ్గారెడ్డి హాజరు కాలేదు. మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో పర్యటించారు. కానీ, డిప్యూటీ సీఎం పర్యటనకు మాత్రం దూరంగా ఉన్నారు.
భట్టి విక్రమార్క జిల్లా నుంచి బయలుదేరిన తర్వాతే మంత్రి దామోదర సంగారెడ్డికి వచ్చి స్థానికంగా ఏర్పాటు చేసిన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. మంత్రి భట్టి విక్రమార్క జిల్లా పర్యటన ఉందని తెలిసినప్పటికీ మంత్రి దామోదర ఉద్దేశపూర్వకంగానే ఆయనను కలవలేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పవర్ పాలిటిక్స్ కారణంగానే ఆయన భట్టి పర్యటనకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తనకు ముఖ్యమైన పదవి లభిస్తుందని ఆశించారు.
కాంగ్రెస్ అధిష్టానం దళిత నేతకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే యోచన చేస్తున్న క్రమం లో భట్టి విక్రమార్కతోపాటు దామోదర రాజనర్సింహ సీఎం రేసులో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టింది. సీఎం పదవి ఆశించిన దామోదర రాజనర్సింహకు కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకుండా మంత్రి పదవికే పరిమితం చేసింది. తనకు కీలక పద వి దక్కకుండా రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క పావులు కదిపారన్న అసంతృప్తి దామోదరలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే డిప్యూటీ పర్యటనకు గైర్హాజరైనట్లు కాంగ్రెస్ క్యాడర్ చర్చించుకుంటున్నారు.
సీఎం వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్రపడిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంగారెడ్డి జిల్లా పర్యటనకు దూరంగా ఉండడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా వారిని కలుస్తుంటారు. ఇటీవలే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఐఐటీ హైదరాబాద్‌లో పర్యటించగా, జగ్గారెడ్డి ఆయనతోపాటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుక్రవారం నాటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క పర్యటనకు మాత్రం జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఇది ప్రస్తుతం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తన సొంత నియోజకవర్గమైన సంగారెడ్డిలో పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనకు ముం దస్తు సమాచారం ఇవ్వలేదని జగ్గారెడ్డి ఆగ్రహంగా ఉన్న ట్లు తెలుస్తుంది. దీనికి తోడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన ప్రసంగంలో సంగారెడ్డిలో ఐఐటీహెచ్ ఏర్పాటుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రస్తావించారు. తాను ఎమ్మెల్సీగా ఐఐటీహెచ్ ఏర్పాటులో భాగస్వామిగా ఉన్నట్లు చెప్పారు. జగ్గారెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించ లేదు. కందిలో ఐఐటీహెచ్ ఏర్పాటు కోసం తాను ఉద్యమించానని, తన వల్లే ఐఐటీహెచ్ ఏర్పాటైందని, అలాంటిది డిప్యూటీ సీఎం తనపేరు ప్రస్తావించకుండా అవమానించారని జగ్గారెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు క్యాడర్ ద్వారా తెలిసింది.
డిప్యూటీ సీఎం తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు జగ్గారెడ్డి సిద్ధ్దమవుతున్నట్లు సమాచారం. భట్టి విక్రమార్క సీఎం పదవి కోసం అంతర్గతంగా పావులు కదుపుతుండడం నచ్చని జగ్గారెడ్డి ఆ కారణంగానే ఉద్దేశపూర్వకంగా భట్టి కార్యక్రమానికి డుమ్మాకొట్టారన్న ప్రచారం కాం గ్రెస్ వర్గాల్లో సాగుతున్నది. కాంగ్రెస్‌లో పవర్ పాలిటి క్స్, నేతల మధ్య అంతర్గత విభేదాలకు భట్టి విక్రమార్క సంగారెడ్డి జిల్లా పర్యటన అద్దం పడుతున్నదని కాంగ్రెస్ నేతలు ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.