నారాయణఖేడ్, మార్చి 30: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని భౌగోళిక పరిస్థితులు, సాగునీటి వనరుల లేమి, వర్షాధార పంటలపై ఆధారపడడం,పారిశ్రామికీకరణపై దృష్టి సారించకపోవడం వంటి కారణాలతో దశాబ్దాలుగా ఇక్కడి నిరుపేదలు వలస వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. వలసల బారిన పడుతున్న నిరుపేదల్లో అత్యధికులు గిరిజనులే కావడం విశేషం.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదలుకుని మార్చి వరకు ఇక్కడి నిరుపేదలు హైదరాబాద్, కర్ణాటక, కామారెడ్డి, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి చెక్కర కర్మాగారాలతో పాటు ఇతర పనులు చేసి ఆరు నెలల పాటు తమ జీవనానికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు. పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారు ఇంటి వద్ద ఉండి మిగతా కుటుంబ సభ్యులంతా వలస వెళ్లడం ఇక్కడ పరిపాటి. చాలీచాలని భూములకు తోడు వ్యవసాయానికి అనుకూలించని నేలలు కావడం చేత పంట చేతికి రావడం కూడా గగనమైన పరిస్థితుల్లో తమ కుటుంబాలను పోషించుకునేందుకు వలస వెళ్లక తప్పని పరిస్థితి.
పెద్దగా సాగు నీటి వనరులు లేకపోవడంతో వర్షాధార పంటలతో వ్యవసాయాన్ని నెట్టుకురావాల్సిన దుస్థితి ఇక్కడి రైతులది. ఓసారి అతివృష్టి మరోసారి అనావృష్టి కారణంగా ఆశించిన స్థాయిలో పంటలు చేతికందకపోవడం ఇక్కడి రైతులకు శాపంగా మారింది. వ్యవసాయం కుంటుపడిన క్రమంలో చిన్న, సన్నకారు రైతులు సహా వ్యవసాయ కూలీలు వలసల వైపు మొగ్గు చూపాల్సి రావడం సహజంగా చోటు చేసుకుంటున్న పరిణామం. ఈ నేపథ్యంలో పదుల ఎకరాల భూములున్న వారు సైతం గ్రామాలను వదిలి బతుకుదెరువు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన సందర్భాలు లేకపోలేదు.
ఏటా ఇక్కడి నుంచి కొనసాగుతున్న వలసలపై దృష్టి సారించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలవైపు అడుగులేసిందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులంతా వలస వెళ్తున్న క్రమంలో చదువుకునే విద్యార్థులు సైతం వారి వెంట వెళ్తుండటతో వారి చదువుకు అంతరాయం ఏర్పడుతుందనే విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఏకంగా ఎనిమిది గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయగా అందులో నాలుగు ఎస్టీ గురుకులాలు కావడం గమనార్హం.
వలసబారిన పడుతున్న విద్యార్థులకు గురుకులాల ఏర్పాటు పెద్ద ఎత్తున సాంత్వన కల్పించిందని చెప్పాలి. వలస వెళ్తున్నవారిలో కొద్దోగొప్పో భూములు కలిగిన వారికి స్థానికంగా సాగునీటి వనరులు అందుబాటులోకి తెచ్చిన పక్షంలో వ్యవసాయానికి పనికిరాని భూములు సైతం వ్యవసాయ యోగ్యం చేయడం ద్వారా చిన్న, సన్నకారు రైతులను వ్యవసాయం వైపు మళ్లించాలన్నది బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ కారణం చేతనే కేసీఆర్ ప్రభుత్వం 1.65 లక్షల ఎకరాలకు సాగు నీరందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడంతో పాటు ఎనిమిది చెరువుల నిర్మాణానికి పూనుకుంది.
వ్యవసాయాన్ని బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, పంటకు గిట్టుబాటు ధర, మార్కెట్యార్డుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు కూలీలుగా మారిన రైతులను తిరిగి వ్యవసాయదారులుగా నిలబెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇవే అంశాలు నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొంత మేరకు వలసలు నివారించేందుకు ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు.
అసెంబ్లీ ఎన్నికల ముందు వలసల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీలు గుప్పించిన కాంగ్రెస్ నాయకులు అధికారం చేపట్టిన తర్వాత పెద్దగా చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఈ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించే దిశగా పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇవ్వగా దాదాపు రెండున్నరేండ్లు గడుస్తున్నా ఒక్క అడుగైనా ముందుకు పడకపోవడం పాలకుల పనితనానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
వలసల నివారణ చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం, ఎనిమిది చెరువుల నిర్మాణ పనులు ముందుకు సాగకుండా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారేందుకు ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని చెప్పక తప్పదు. రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్ వంటివి ఏమేరకు అమలవుతున్నాయో అందరికీ తెలిసిందే. పదేండ్లు వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న రైతు తిరిగి చెరుకు బండి తోలాల్సిన దుస్థితి దాపురించింది.
ఈ పరిస్థితుల దృష్ట్యా సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వలసలు అధికమయ్యాయనే అంచనా ఉంది. ఏదేమైనా వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ సాగు నీటి వనరులను అందుబాటులోకి తేవడంతో పాటు పరిశ్రమల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
దశాబ్దాలుగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిరుపేదలు వలస వెళ్లి జీవ నం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడి వలస బతుకులు మాత్రం మారడం లేదు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చుడు తప్పా ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకునే దిశగా సాగునీటి వనరులు కల్పించాల్సిన అవసరం ఉంది. వలసల నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తే వలసలు కొంత వరకైనా తగ్గే ఆస్కారం ఉంటుంది.
– గణపతి, సామాజిక కార్యకర్త, కరస్గుత్తి, నాగల్గిద్ద మండలం, సంగారెడ్డి జిల్లా