జోర్డాన్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 12 మంది తెలంగాణ వాసుల కష్టాలు, కన్నీళ్లపై చలించిన మాజీమంత్రి హరీశ్‌రావు స్పందించి, వారికి సంబంధించిన జరిమానా చెల్లించి, దేశానికి రప్పించి, ప్రత్యేక వాహనాల్లో సురక్షితంగా వారి ఇండ్లకు చేర్చారు. ఇందులో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఉన్నారు. శుక్రవారం రాత్రి దుబ్బాకకు చేరుకున్న దాసరి (పండ్యాల) మహేందర్ కుటుంబీకులను కలుసుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు. శనివారం మహేందర్‌ను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది.
దుబ్బాక, అక్టోబర్ 25: సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన దాసరి మహేందర్‌ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు నర్సమ్మ, పోచయ్యకు ముగ్గురి సంతానం. వీరి కుల వృత్తి యక్షగానానికి ఆదరణ లేకపోవడంతో కూలీ పనులు చేస్తూ జీవించేవారు. మహేందర్ తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. నిజామాబాద్‌కు చెందిన లావణ్యతో పెండ్లి అయ్యింది. రెండేండ్ల కిందట కుమారుడు మహాన్షు పుట్టాడు. అతను తక్కువ బరువుతో పుట్టడంతో ప్రైవేటు దవాఖానల్లో చికిత్సలు చేయిస్తే రూ.4 లక్షలకు పైగా ఖర్చు అయ్యింది. దినసరి కూలీ పనులతో అప్పులు తీర్చడం కష్టంగా మారింది. ఆ సమయంలో తెలిసిన వాళ్లు జోర్డాన్‌లో ఉపాధి అవకాశం ఉన్నట్లు మహేందర్‌కు చెప్పారు. ముంబయిలో ఓ ఏజెన్సీ ద్వారా వీసాకు ఎలాంటి ఖర్చులేకుండా సెప్టెంబర్ 2024న జోర్డాన్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక నరకం అంటే ఏమిటో అతనికి కనిపించింది. రోజుకు 10 గంటలు, ఒక్కోసారి అంతకంటే మరిన్ని గంటలు పనిచేయింవారు.
మండుటెండల్లో, ఉక్కపోతలో వ్యవసాయానికి సంబంధించిన కూలీ పనులు చేయించేవారు. కంపెనీవాళ్లు చెప్పింది చేయాలి. పని చేయపోతే భోజనం పెట్టకుండా ఇబ్బందులకు గురిచేసేవాళ్లు. వారు పెట్టే టార్చర్‌తో చనిపోవాలని అనుకున్నారు వీరంతా. ఖర్చు లేకుండా వీసా ఇచ్చినందుకు మాతో అక్కడి కంపెనీలు అగ్రిమెంట్ చేయించుకున్నాయి. రెండేండ్లు తప్పనిసరిగా కంపెనీలో పనిచేయాలని, లేకపోతే ఒక్కొక్కరు రూ. 2 లక్షల జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్లో ఉంది. నెలకు వేతనం రూ.220 దినారులు, ఇండియా కరెన్సీలో రూ.26 వేలు చెల్లించేవారు. ఆ డబ్బులు వీరి ఖర్చులకు సరిపోయేవి కాదు. అధిక పనిభారం, వెట్టిచాకిరీ చేయించేవాళ్లు. ఈ విషయంపై పలుసార్లు జోర్డాన్‌లో ఇండియా ఎంబసీకి మహేందర్‌తో పాటు తెలంగాణ కార్మికులు విన్నవించినా ఏ అధికారి పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణలోని కాంగ్రెస్ మంత్రులకు ఫోన్ ద్వారా విన్నవించినా పట్టించుకోలేదు.
చివరి ప్రయత్నంలో మాజీ మంత్రి హరీశ్‌రావుకు విన్నవించడంతో ఆయన స్పందించి, వెనువెంటనే చర్యలు చేపట్టారు. తెలంగాణకు చెందిన 12 మందిని సురక్షితంగా రప్పించేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడారు. 12 మంది కార్మికులకు సంబంధించి సుమారు రూ. 20 లక్షల వరకు చెల్లించి వారందరికీ సురక్షితంగా సొంతూరికి చేర్చారు. ఎయిర్‌పోర్టుకు వాహనం పంపించి, వారి ఇంట్లో భోజనం పెట్టించి, కానుకలు ఇచ్చి ఆప్యాయంగా కుటుంబీకుల వద్దకు చేర్చాడు హరీశ్‌రావు. దీంతో జీవితాంతం హరీశ్‌రావుకు రుణపడి ఉంటామని మహేందర్‌తో పాటు మిగతా కార్మికులు పేర్కొంటున్నారు. మహేందర్ క్షేమంగా ఇంటికి రావడంతో అతడి భార్య లావణ్య, తల్లిదండ్రులు నర్సమ్మ, పోచయ్య ఆనందానికి గురయ్యారు. హరీశ్‌రావు సార్ దయతో తమ కొడుకు మళ్లీ మా ఇంటికి క్షేమంగా వచ్చాడని, తన భర్తను బతికించిన దేవుడు హరీశ్‌రావు సార్ అని లావణ్య కన్నీళ్లతో చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.
బతుకు దెరువుకోసం జోర్డాన్ దేశం పోతే…అక్కడ తిండీతిప్పలు లేక అవస్థలు పడ్డాం. మా బాధలు పట్టించుకునే నాథుడు లేరు. నెలల తరబడి నరకయాతన అనుభవించాం. పనిచేయకపోతే తిండి పెట్టలేదు. ఆకలితో అలమటించాం. మండుటెండల్లో .. ఉక్కపోతలో రోజుకు 10 గంటల పని చేయించేవారు. అయిన వాళ్లను వదిలి ఉపాధి కోసం దేశం కానీ దేశం పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని ఏ సర్కారు పట్టించుకోలేదు.
బీఆర్ఎస్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహకారంతో మళ్లీ ప్రాణాలతో సొంతూళ్లకు చేరుకున్నాం. ఇది నిజంగా నాకు పునర్జన్మ. నాతో పాటు మరో 11 మందిని క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు హరీశ్‌రావు సార్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. జోర్డాన్ దేశం గురించి తెలియక పోయి బోర్ల పడ్డాం. నిద్రలేని రోజులు గడిపాం. మా కష్టాలను మన ఎంబసీకి విన్నవించినా పట్టించుకోలేదు. కేంద్ర బీజేపీ సర్కారుకు, తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు లేఖలు రాసినా మమ్మల్ని పట్టించుకోలేదు. మాజీమంత్రి హరీశ్‌రావుకు మా బాధలను ఫోన్లో విన్నవించడంతో ఆయన వెంటనే స్పందించి, మమ్మల్ని క్షేమంగా దేశానికి రప్పించేందుకు కృషిచేశారు.
– దాసరి హహేందర్, దుబ్బాక ( సిద్దిపేట జిల్లా)