సంగారెడ్డి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): విలీన పంచాయతీల్లోని రాజకీయనేతల భవిష్యత్ అంధకారంగా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం తొలుత సంగారెడ్డి జిల్లాలోని 11 పంచాయతీలను అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. రెండు మున్సిపాలిటీలను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు సన్నద్ధమవుతుంది. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో విలీనమైన 11 పంచాయతీల్లోని రాజకీయ నాయకులు నామినేటెడ్ పదవులు మినహా ప్రత్యక్ష ఎన్నికల్లో పదవులు దక్కే అవకాశాలు మృగ్యం కానున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలంలో ఆరు పంచాయతీలను అమీన్పూర్ మున్సిపాలిటీలో, పటాన్చెరు మండలంలోని ఐదు గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న విలీనం నిర్ణయంతో 11 పంచాయతీల్లోని రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు మండలంలోని ముత్తంగి, పోచారం, కర్ధనూర్, పాటి, ఘనపూర్ పంచాయతీ సర్పంచ్‌లు, అమీన్‌ఫూర్ మండలంలోని ఐలాపూర్, ఐలాపూర్తండా, కృష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ, దాయర, సుల్తాన్పూర్ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగిసింది. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసినప్పటికీ వచ్చే సర్పంచ్ ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అన్ని పార్టీలకు చెందిన 11 గ్రామాల్లోని నాయకులు సిద్ధపడుతున్న క్రమంలో పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు.
దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పదవులు ఆశించిన నేతలు భంగపడ్డారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనమైన ఆరు పంచాయతీల పరిధిలో మూడు ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ పదవులు ఉన్నాయి. మున్సిపాలిటీలో విలీనంతో జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ పదవులకు పోటీపడే అవకాశాన్ని రాజకీయనేతలు కోల్పోయారు. పటాన్చెరు మండలంలోని ఐదు పంచాయతీలకు చెందిన నేతలు జడ్పీటీసీ, ఎం పీపీ, వైఎస్ ఎంపీపీ, ఎంపీటీసీ పదవులకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయారు. వీటితోపాటు పీఏసీఎస్ సభ్యులు, చైర్మ న్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుల పదవు లు రాజకీయనేతలు కోల్పోయారు.
జిల్లాస్థాయిలో ఉండే జడ్పీచైర్మన్, వైస్‌చైర్మన్, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ పదవులకు విలీన గ్రామనేతలు పోటీ పడే అవకాశాలు లేవు. మున్సిపాలిటీలో విలీనమైన 11 పంచాయతీలకు రెండు మున్సిపాలిటీల్లో కేవ లం వార్డు కౌన్సిలర్ పదవులు మాత్రమే దక్కినా అవి రెండు నుంచి ఐదులోపు ఉంటాయి. ఇక అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే కేవలం రెండు నుంచి మూడు కార్పొరేట్ పదవులకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది. పంచాయతీల విలీనంతో పెద్దఎత్తున పదవులు కోల్పోతుండటంతో అన్ని పార్టీల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీన గ్రామాల్లోని నేతలకు నామినేటెడ్ పదవుల్లో సైతం ప్రాధాన్యత దక్కే అవకాశాలు తక్కువే.
Pp