రామాయంపేట, జూలై 1: ప్రస్తుత తరుణంలో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగుచేసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటలో ఆమె ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ మొక్కలను శీలం బాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి భూముల్లో నాటారు.అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు.
ఉద్యానశాఖ ద్వారా ఆయిల్పామ్సాగు చేస్తున్న రైతులకు మొక్కలపై రాయితీతో బాటు నాలుగేండ్లు తోట నిర్వహణ, అంతర పంటల సాగు కోసం రాయితీ సొమ్మును రైతులఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందన్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 12 ఎకరాలకు డ్రిప్ పరికరాలపై కూడా రాయితీ ఉంటుందన్నారు.ఆయిల్ పామ్ మొక్కలు నాటిన నాలుగేండ్ల అనంతరం ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందన్నారు.
ప్రతి రైతు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేయాలని సూచిం చారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌పామ్ పంటలు సాగుచేసుకోవాలనే రైతులకు నిజాంపేట మండలం చల్మెడలోనే మొక్కలు లభిస్తాయన్నారు. జిలా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1857 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంటలు సాగు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతులు శీలం వెంకట్‌రెడ్డి, బాల్‌రెడ్డి, పట్టు పరిశ్రమశాఖ మెదక్ జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్, వ్యవసాయ శాఖ రామాయంపేట, నిజాంపేట మండలాల అధికారులు ప్రవీణ్‌కుమార్, సోమలింగారెడ్డి, లివ్ పరిశ్రమ అధికారులు, మైక్రో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.