యువ హీరో విశ్వక్సేన్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘కల్ట్’ పేరుతో ఓ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో సందీప్ కాకరాలతో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో హీరో కూడా ఆయనే. గాయత్రి భరద్వాజ్ కథానాయిక. దేశంలోనే తొలి అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. నిజజీవితంలోని భయానక సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేసేలా సినిమా ఉంటుందని విశ్వక్సేన్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు.
‘హీ ఈజ్ మై దోస్తీ’ అని సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రాయగా, రవి బస్రూర్ స్వరపరిచారు. కార్తీక్ ఆలపించారు. స్నేహం అంటే ఏంటో తెలియజెప్పే పాట ఇదని మేకర్స్ తెలిపారు. తొలిసారి గోవా ట్రిప్ వెళ్లిన స్నేహితుల బృందం, అక్కడి నైట్ లైఫ్‌ని ఆస్వాదిస్తూ సాగే పాట ఇది. గోవా అందాల నడుమ సందడిగా ఈ పాట సాగింది. అంతర్లీనంగా ఓ చీకటి ప్రపంచాన్ని కూడా ఈ పాట సూచిస్తున్నది. విశ్వక్సేన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తున్నది. తారక్ పొన్నప్ప, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ తదితరులు ఇతర పాత్రాలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తరుణ్‌భాస్కర్, కెమెరా: అరవింద్ విశ్వనాథన్.