సిద్దిపేట, జూన్ 25 : “గతంలో మేదరి కులాన్ని ఎవరూ పట్టించుకోలే.. సీఎం కేసీఆర్ మేదరులను గుర్తించి వారికి హైదరాబాద్‌లో ఎకరం జాగా, కోటి రూపాయలతో భవనాన్ని మంజూరు చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు” అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం తెలంగాణ మేదరి సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు సీఎం కేసీఆర్ అని, ప్రతి వర్గాన్ని..కులాన్ని అభివృద్ధి చేయాలని.. ప్రతి వృత్తిని ప్రోత్సహించాలని నిరంతరం ఆలోచిస్తున్నారన్నారు. సిద్దిపేట పట్టణంలో రాష్ట్రంలోనే మొదటి సారిగా మేదరి సంఘం భవనాన్ని రూ.30 లక్షలతో నిర్మించామన్నారు.
హైదరాబాద్‌లో నిర్మించనున్న మేదరి సంఘం భవనానికి మరో కోటి రూపాయలు మంజూరు చేయిస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భవనాలు నిర్మిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారన్నారు. మేదరులకు రూ. 85 లక్షలను మాఫీ చేసి వెదురు బొంగుల సరఫరా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో హరితహారంలో భాగంగా వెదురు వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి రూ.లక్ష అందజేస్తున్నారని, ఇది నిరంతర ప్రక్రియ అని, ప్రతి నెలా 300 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. త్వరలో ప్రారంభమయ్యే గృహలక్ష్మి పథకానికి ఇండ్లు లేని మేదరులకు అవకాశం కల్పిస్తామన్నారు. మేదరి సంఘం సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. తెలంగాణ వచ్చి సీఎం కేసీఆర్ కావడం వల్లనే అభివృద్ధి సాధ్యమైందని, 33 జిల్లాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, మనమందరం సీఎం కేసీఆర్‌కు అండగా ఉండి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మేదరి సంఘం రాష్ట్ర నాయకుడు వెంకటరాముడు, మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కోనం రాజయ్య, నాయకులు నర్సింహులుతో పాటు ఆయా జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కులవృత్తులకు ప్రోత్సాహం
గతంలో ఎవరూ కులవృత్తులను పట్టించుకోలేదు..కులవృత్తులను ప్రోత్సహించే ఏకైక పార్టీ బీఆర్ఎస్.. సీఎం కేసీఆరే మాత్రమే. బీసీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాల లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు డిగ్రీ కళాశాలలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ బీసీలను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మేదరి సంఘం భవనాలు నిర్మించి ఇస్తాం.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి
అన్ని వర్గాలకు ఆత్మగౌరవం
గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదు. రైతులు సైతం ఉపాధి కోసం వలసవెళ్లిన రోజులు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని కుల సంఘాలను గుర్తించి వృత్తులను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తూ బీసీల ఆత్మగౌరవానికి బాటలు వేశారు. తెలంగాణ సంస్కృతి, కులవృత్తులను కాపాడాలని ప్రతి కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ. లక్ష అందిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల వివక్ష చూపుతూ కనీసం బీసీ సంక్షేమశాఖను కూడా ఏర్పాటు చేయలేదు.
– సత్యవతిరాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి