చేగుంట, జూన్ 12: ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందాడు. పది రోజులైనా మృతదేహం స్వగ్రామానికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన చింతకింది కిరణ్(35) గత ఏడాది మేలో బతుకు దెరువు కోసం దుబాయ్‌కి వెళ్లాడు.
అతనికి ఈనెల 2న గుండెపోటు రావడంతో అక్కడే మృతిచెందినట్లు సమాచారం అందింది. కిరణ్ మరణవార్త తెలుసుకున్న కుటుంబీకులు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం ప్రవాసీ ప్రజావాణి సహాయాన్ని ఆశ్రయించారు. అధికారులు స్పందించి దుబాయ్‌లోని రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ సాయికిరణ్ మృతదేహాన్ని స్వగ్రామానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, కుటుంబీకులు కోరుతున్నారు. మృతుడికి భార్య నాగలక్ష్మి, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.