తూప్రాన్, మే 21: మెదక్ జిల్లా తూప్రాన్ బైపాస్‌లోని 44 నెంబర్ జాతీయ రహదారిపై కంటైనర్ దగ్ధమైంది. హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ నజీమ్ (35), ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్ నుంచి ఏపీలోని కాకినాడకు కార్లలోడ్తో కంటైనర్ వెళ్తున్నది. తూప్రాన్ బైపాస్‌లోని నాగులపల్లి బ్రిడ్జి వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి కంటైనర్‌లోని ఎనిమిది కార్లు దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న సీఐ వెంకటరాజగౌడ్, ఎస్సై గంగరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి కంటైనర్ దగ్ధమైంది. జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను బైపాస్ నుంచి తూప్రాన్ గుండా మళ్లించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తులో ఉంది.