Medak RTO Office | మెదక్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా రవాణా శాఖ (ఆర్టీవో) కార్యాలయంలో సామాన్య ప్రజలకు సేవలు అందడంలో తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీవో కార్యాలయంలో ప్రతి పనిని ఏజెంట్ల ద్వారా వెళ్తేనే అధికారులు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఓకే రవాణా శాఖ కార్యాలయం ఉండడంతో జిల్లా మొత్తం ప్రజలు అవసరాల నిమిత్తం అక్కడికి రావాల్సి ఉంటుంది.
యూనిట్ కార్యాలయంతో పాటు ఆర్టీవో కార్యాలయం ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. యూనిట్ కార్యాలయం జిల్లా మొత్తానికి ఒకటే ఉంది. ఆర్టీవో తో పాటు ఎంవీఐ, ఏ ఎంవీఐతో పాటు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రజలకు సులభంగా సేవలు అందించాల్సిన చోట, మధ్యవర్తులు (ఏజెంట్లు) ఆధిపత్యం పెరిగిపోవడంతో, నేరుగా వెళ్లే సాధారణ వ్యక్తుల పనులు రోజులు, వారాలు పట్టే పరిస్థితి ఏర్పడింది. నేరుగా వెళ్లిన ప్రజల పనులు నిబంధనల పేరుతో అధికారులు చేయడం లేదు. అదే పని కోసం ఏజెంట్ ద్వారా వెళితే క్షణాలలో అధికారులు సంతకాలు చేస్తున్నారు. మెదక్ ఆర్టీవో కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు ప్రత్యేక కథనం ఇది..
ఏజెంట్ల ద్వారా వెళితేనే పనులు …?
డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ తో పాటు పలు పనుల కోసం కార్యాలయానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే పనులను ఏజెంట్ల ద్వారా చేయించుకుంటే గంటల్లోనే పూర్తవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
“ఏజెంట్‌కు డబ్బు ఇస్తే ఫైల్ కదులుతుంది… లేదంటే అదే ఫైల్ రోజులు పడుతుంది” అని ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆన్ లైన్ సేవలు అమలు చేసిన ఆర్టీవో కార్యాలయంలో ఏజెంట్ల ద్వారా పనులు జరుగుతున్నాయి.
ఆఫీసులో బ్రోకర్ల దండయాత్ర..
ఆర్టీవో కార్యాలయం ప్రాంగణంలోనే బ్రోకర్లు స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలను ఆకర్షించడం సాధారణంగా మారింది. కొత్తగా వచ్చే వారిని ‘మీ పని వెంటనే చేస్తాం’అంటూ ఒప్పించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం.
ఈ బ్రోకర్లకు కొందరు సిబ్బంది మద్దతు ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఆన్లైన్ సేవలు ఉన్నా ప్రయోజనం లేదు..?
ప్రభుత్వం చాలా సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చినా, టెక్నికల్ సమస్యలు, అవగాహన లోపం కారణంగా ప్రజలు మళ్లీ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని బ్రోకర్లు అవకాశంగా మార్చుకుని దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏజెంట్లు అందిన కాడికి దోపిడీ చేస్తున్నారు. ఏజెంట్లకు రవాణా శాఖ అధికారుల ప్రోత్సహం ఉండడంతో అవినీతి పెరిగిపోతుంది.
ఫీజులు ఒకటి – వసూళ్లు మరొకటి..
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు ఒకవైపు ఉండగా, ఏజెంట్ల ద్వారా చేయించుకుంటే రెట్టింపు నుంచి మూడు రెట్లు వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా లైసెన్స్, ఫిట్నెస్, పర్మిట్ పనుల్లో ఈ అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని సమాచారం. రవాణా శాఖ అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించడం లేదు. ఆర్టీవో కార్యాలయంలో పర్యవేక్షణ చేయవలసిన జిల్లా స్థాయి అధికారి ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. జిల్లాస్థాయి సమావేశాల పేరుతో కార్యాలయానికి రావడం లేదని పలువురు తెలిపారు.
ఆర్టీవో కార్యాలయంలో ఏజెంట్లను నిషేధించాలి..?
ఆర్టీవో కార్యాలయంలో బ్రోకర్లను పూర్తిగా నిషేధించాలి. ప్రతి సేవకు టైమ్ లిమిట్ నిర్ణయించాలి. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ పనులు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలి ప్రజలు కోరుతున్నారు.
అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..!
ప్రజలకు సేవ చేయాల్సిన కార్యాలయం అవినీతి కేంద్రంగా మారితే, ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతింటుంది. మెదక్ ఆర్టీవో కార్యాలయంలో జరుగుతున్న ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
