
గజ్వేల్ రూరల్, నవంబర్ 5 : మున్సిపాలిటీల్లో ఆస్తుల (భవనాల) సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భువన్ సర్వేను ప్రారంభించింది. ఇందుకోసం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా సిబ్బందిని అధికారులు నియమించారు. ఈ మేరకు త్వరితగతిన సర్వేను పూర్తి చేసి ఆన్లైన్లో ఇండ్ల వివరాలను నమోదు చేసేందుకు సర్వేను చకచకా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి విస్తీర్ణం, ఖాళీ ప్రదేశాల ఫొటోలతో సహ ఇతర వివరాలను వేగవంతంగా సేకరిస్తున్నారు. పన్నుల చెల్లింపులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ చేపడుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీల్లో 177105 ఇండ్లు ఉండగా 86127 ఇండ్ల వివరాలను అధికారులు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రధానంగా దుబ్బాక మున్సిపాలిటీ 96శాతం సర్వే పూర్తి చేసింది. ఇక్కడ 5440 ఇండ్లు ఉండగా అందులో ఇప్పటి వరకు 5214 ఇండ్ల వివరాలను అధికారులు ఆన్లైన్లో పొందుపర్చారు.
వేగంగా భువన్ సర్వే..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భువన్ సర్వే వేగంగా సాగుతుంది. పట్టణాలు రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఇంటి వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్‌లో ఇంటి విస్తీర్ణం, ఖాళీ ప్రదేశం, తదితర వివరాలు నమోదవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తరువాత జరుగుతున్న అభివృద్ధితో పట్టణాల నలువైపులా ఇండ్ల నిర్మాణాలు పెరుగుతున్నాయి. అలాగే, పాత భవనాలపై నిర్మాణాలు చేపడుతుండడంతో పాటు డిజైన్లను మార్చుతూ కొత్త హంగులతో నిర్మాణాలు చేపడుతున్నారు. 2016లోనే భువన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చి పలు మున్సిపాలిటీల్లో అమలు చేయగా వాటి ఆదాయం పెరిగింది. దీంతో రాష్ట్రమంతటా ఇదే పద్ధతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భువన్ సర్వేతో పెరగనున్న ఆదాయం..
భువన్ సర్వే పూర్తైతే మున్సిపాలిటీలకు ఆదాయం మరింత పెరగనుంది. ప్రతి ఇంటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంతో పన్ను ఎగవేతదారులకు చెక్ పడుతుంది. ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చేసి ఫొటో, విస్తీర్ణంతో పాటు సమగ్ర సమాచారాన్ని యాప్‌లో పొందుపరుస్తున్నారు. దీంతో ప్రతి ఇంటి యజమాని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాంటి వివరాలైనా అవసరమైతే ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.
బిల్ కలెక్టర్లతో సర్వే బృందాలు..
భువన్ సర్వే పూర్తి చేసేందుకు బిల్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో బృందంలో నలుగురు సభ్యులుగా ఉంటారు. ప్రతి ఇంటి కొలతలు, ఫొటో లు, మిగతా వివరాలు ఆన్లైన్ చేసే బాధ్యతను పూర్తిగా వీరికే అప్పగించారు. 2012లో గజ్వేల్ మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి విస్తీర్ణంలో పట్టణం నాలుగు వైపులా రాజిరెడ్డిపల్లి, సంగాపూర్, మూట్రాజ్‌పల్లి, గుండన్నపల్లి, ప్రజ్ఞాపూర్‌లలో సుమారు 1500కు పైగా కొత్త ఇండ్ల నిర్మాణం జరిగింది. సంగాపూర్, మూట్రాజ్‌పల్లి గ్రామాల సమీపంలోనే ప్రభుత్వం ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం చేపట్టడంతో కొత్తగా మరో 2500 ఇండ్లు పూర్తి కాగా, మరో 3500 ఖాళీ ప్లాట్లను ముంపు గ్రామాల ప్రజల కోసం సిద్ధం చేస్తున్నారు. దీంతో గజ్వేల్‌లో 14వేల వరకు ఇండ్లుండే అవకాశం ఉంది.
మున్సిపాలిటీల వారీగా సర్వే పూర్తి..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలుండగా 14 మున్సిపాలిటిల్లో భువన్ సర్వే వేగవంతంగా సాగుతుంది. జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీ సర్వేలో ముందంజలో ఉండగా ఇప్పటి వరకు నర్సాపూర్, అమీన్పూర్, బొల్లారంలో సర్వే ప్రారంభం కాలే దు. అత్యధికంగా సిద్దిపేటలో 28350 ఇండ్లు ఉండగా అతి తక్కువగా నారాయణ్‌ఖేడ్‌లో 4201 ఉన్నాయి. మున్సిపాలిటీల వారీగా భువన్ సర్వే పూర్తైన ఇండ్ల వివరాలు.. దుబ్బాకలో 5440 ఉండగా 5214లో సర్వే పూర్తయింది. నారాయణ్‌ఖేడ్‌లో 4201 ఇండ్లకు 3802, తెల్లాపూర్‌లో 8362కి 7501, గజ్వేల్‌లో 8375కి 6147, సిద్దిపేటలో 28350కి 22713, మెదక్‌లో 11275కి 7770, తూప్రాన్‌లో 5780కి 3938, జహీరాబాద్‌లో 16101కి 8702, హుస్నాబాద్‌లో 6167కి 3611, అందోల్‌లో 4791కి 2463, సదాశివపేటలో 9473కి 4352, రామాయంపేట 5019కి 2317, సంగారెడ్డిలో 20529కి 7119, చేర్యాలలో 4545కి 478 ఇండ్ల భువన్ సర్వే పూర్తయ్యినది.
త్వరలోనే భువన్ సర్వే పూర్తి చేస్తాం
భువన్ సర్వేను త్వరలోనే పూర్తి చేసి ఆన్లైన్లో ఇండ్ల వివరాలను నమోదు చేస్తాం. వ్యాపార సముదాయ, ఇండ్ల వివరాల సేకరణ మాత్రమే మిగిలి ఉండగా బిల్కలెక్టర్ల బృందాలతో సర్వేను వేగవంతంగా చేపడుతున్నాం. ప్రతి ఇంటి యజమాని భువన్ సర్వేలో పూర్తి సమాచారాన్ని అసెస్మెంట్ చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా తప్పుడు వివరాలు ఇస్తే వారిపై 20 రేట్ల జరిమానా విధిస్తాం.