
కోహీర్, నవంబర్ 5: పురాతన కట్టడాలతో ఆ గ్రామం చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నది. అద్భుతమైన కట్టడాలతో చిరస్థాయిగా నిలిచి ఉండనున్నది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పీచేర్యాగడి గ్రామంలో వందేండ్ల క్రితం నిర్మించిన బురుజులు చరిత్రకు అనవాళ్లుగా నిలుస్తున్నాయి. స్వాతంత్య్రం రాకముందు తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు గ్రామస్తులు శ్రమకోర్చి బురుజులను నిర్మించుకున్నారు. గ్రామానికి నలువైపులా నాలుగు బురుజుల నిర్మాణాలను చేపట్టారు. గ్రా మంలోకి అక్రమ చొరబాటుదారులు రాకుండా పటిష్టమైన ప్రణాళికలు తయారు చేసుకొన్నారు. రాత్రివేళల్లో కాపలా ఉండేందుకు బురుజులను వినియోగించుకొని నిఘా పెట్టేవారు. తుపాకులు, తదితర ఆయుధాలు ధరించి కాపలా కాసేవారు. ఇతరులు ఎవరైనా గ్రామంలోకి అక్రమంగా వస్తున్నట్లు తెలిస్తే వెంటనే ప్రజలకు సమాచారం అందించేవారు. దాడులు చేసేందుకు వచ్చినా లేక దొంగతనానికి వచ్చినా కూడా వారికి ఇట్టే తెలిసిపోయేది. దీంతో వారు చాకచక్యంతో సమస్యను పరిష్కరించేవారు. వారిని పట్టుకొని కఠినంగా శిక్షించేవారు. గ్రామంలో గడీల పాలన కొనసాగేది. ప్రజలు బయటకు వెళ్లాలన్నా, బయటి వారు లోపలికి రావాలన్నా బురుజుల వద్ద ఉండే కాపలాదారులకు ముందస్తు సమాచారం అందించాలి. వారి నిర్ణయంతోనే అంతా జరిగేది.
గ్రామంలో ప్రశాంత వాతావరణం..
గ్రామం ప్రశాంతంగా ఉండేందుకు ప్రజలందరూ కలిసిమెలిసి జీవనం కొనసాగించేవారు. గ్రామానికి చివరన నాలుగు మూలల్లో నాలుగు బురుజులను నిర్మించారు. తమ పూర్వీకుల జ్ఞాపకాలు కండ్లముందు కదలాడుతున్నాయని వృ ద్ధులు ఆనంద భాష్పాల మధ్య వెల్లడించారు. కొత్తవారు ఎవరైనా వచ్చి బురుజులను చూస్తే వారు సంభ్రమాశ్చార్యానికి లోను కావాల్సిందే. అందమైన పురాతన కట్టడాల సమీపంలో ఇటీవల నాయకి, తదితర సినిమాల షూటింగ్లను నిర్వహించారు. అద్భుతమైన కట్టడాలు గ్రామానికి మరింత శోభను తెచ్చిపెట్టాయి. పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. పెద్దపెద్ద రాళ్ల తో నిర్మించిన ఒక బురుజు నుంచి పెచ్చులూడి కిందపడుతున్నాయి. ప్రజలను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్న తమ పూర్వీకుల పనితీరుపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
మరమ్మతులు చేపట్టాలి
గ్రామంలోని ప్రజలను కాపాడుకునేందుకు నాలుగు మూలల్లో నిర్మించిన నాలుగు బురుజులు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక బురుజుకు ఉన్న రాళ్లు కిందపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉన్నతాధికారులు స్పందించి వాటికి మరమ్మతులు చేపట్టాలి.
రవికిరణ్, పీచేర్యాగడి సర్పంచ్
గ్రామానికి రక్షణగా..
పీచేర్యాగడి గ్రామ ప్రజలకు రక్షణ కల్పించడానికి నాలుగు బురుజులను నిర్మించారు. మా తాతల కాలంలోనే వాటిని నిర్మించినట్లు మాకు చెప్పారు. రాత్రుల్లో తుపాకులను ధరించి బురుజులపై నుంచి గ్రామానికి కాపలా కాసేవారు. దొంగలు ఎవరైనా వస్తే ఇక్కడి నుంచి ఆయుధాలతో వారిపై దాడులు కూడా చేసేవారంట.
-ప్రకాశ్, పీచేర్యాగడి, గ్రామస్తుడు
చిన్నప్పటి నుంచి చూస్తున్నం..
గ్రామంలో బురుజులను చిన్నప్పటి నుంచి చూస్తున్న. పెద్దపెద్ద ఎర్రరాళ్లతో చాలా బాగా కట్టారు. ఇలాంటి పురాతన కట్టడాలను కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు వాటి విలువ, చరిత్ర తెలుస్తున్నది.
-పండరి, పీచేర్యాగడి వృద్ధుడు