
మెదక్/సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 5: ఈ నెల 8 నుంచి పోడు భూములకు సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించడానికి పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమణకు గురైన అటవీ భూమి వివరాలను క్షేత్ర స్థాయికి వెళ్లి వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆక్రమణకు గురైన అటవీ భూముల్లో సాగు చేస్తున్న రైతుల వివరాలు సేకరించాలని సూచించారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాలో 17 మండలాల్లోని 82 గ్రామ పంచాయతీల్లో 85 హాబిటేషన్లలో 6,865.95 ఎకరాలు అటవీ ప్రాంతం అన్యాక్రాంతమైనట్లు గుర్తించామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 10 మం డలాల్లోని 37 పంచాయతీలు, హాబిటేషన్లలో 2,958.36 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్టు గుర్తించామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బృందాలతో పాటు అటవీ పరిరక్షణ కమిటీ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ బృందాలు సోమవారం నుంచి గ్రామ స్థాయిలో గ్రామ సభలు ఏర్పా టు చేసుకొని ఫారం-ఏలో అభ్యంతరాలు నమోదు చేసుకొని మండల టీమ్‌కు పంపుతాయని, ఆ బృందం సర్వే చేసి సరైనదని భావిస్తే డివిజన్ టీమ్‌కు అనంతరం జిల్లా బృందానికి పంపగా అక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి గావించి హక్కు పత్రాలు అందజేస్తారని తెలిపారు.