దుబ్బాక, ఫిబ్రవరి 5: కేంద్ర బీజేపీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ జాతి సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతూ పేదలను విస్మరిస్తున్నడని మండిపడ్డారు. ఆదివారం దుబ్బాకలో పలు వివాహ కార్యక్రమాలతో పాటు లచ్చపేటలోని మార్కండేయ దేవాలయ వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేంద్ర బడ్టెట్‌లో తెలంగాణకు తీరని ఆన్యాయం జరిగిందన్నారు.
పేదల పొట్టేందుకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతుందని దుయ్యబట్టారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశంలో నెంబర్‌వన్‌గా నిలిపారని కొనియాడారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పచ్చి అబద్ధాల కోరు అని విమర్శించారు. పొద్దున లేస్తే అబద్ధాలు,అసత్య ప్రచారాలు చేయడం ఆయన నైజం అని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి రెండేండ్లుగా గడిచిన నియోజకవర్గంలో చిన్నపాటి అభివృద్ధి పని చేయలేదని విమర్శించారు. చేతకాని ఓ అసమర్ధ ఎమ్మెల్యేగా రఘునందన్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. మల్లన్నసాగర్‌పై ఎమ్మెల్యే రఘునందన్ డ్రామాలు ఆడడం విడ్డూరంగా ఉందన్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులను ఎమ్మెల్యే మోసగించాడని, నాడు మల్లన్నసాగర్‌ను అడ్డుకునేందుకు అక్కడి రైతులను రెచ్చగొట్టి కేసులు వేయించి, ఇప్పుడు అదే మల్లన్నసాగర్లో చేపలు పెంపకం చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలవటం ఏమిటని ప్రశ్నించారు.
మతం పేరిట ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌కు దుబ్బాక ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. బీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టేందుకు, రిబ్బన్ కత్తిరించేందుకు కత్తెర మాస్ట్టర్గా స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో నియంత పాలన కొనసాగిస్తున్న బీజేపీని అంతమొందించేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని తెలిపారు. కేసీఆర్ పాలన కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తప్పకుండా కేంద్రంలో బీఆర్ఎస్ సత్తాచాటుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రవిందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, కిషన్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీధర్, దేవరాజ్, తదితరులు పాల్గొన్నారు.