రామాయంపేట, మే 03: మల్లె చెరువు దుర్వాసనతో పట్టణవాసులు తీవ్ర ఆనారోగ్యాల బారిన పడుతున్నారు. చెరువు పట్టణానికి ఆనుకుని ఉండటంతో చెరువు గబ్బు వాసనతో భరించలేకుండా ఉంటున్నారు. చెరువును ఆధునీకరిస్తామంటూ అధికారులు సర్వేల మీద సర్వేలు చేసినా మల్లె చెరువు తీరు మాత్రం మారడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లె చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని ప్రతిపాదనలు చేసి నిధులు కూడా మంజూరు చేసింది. తీరా కొద్దిగా పనులు జరగడంతోనే ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇక సుమారు రెండేండ్ల కాలం నుంచి నిధుల్లేక సంబంధిత కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. చెరువును మళ్లీ ఆధునీకరిస్తామంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సమయంలో హామీల మీద హామీలు కురిపించి అప్పుడు ఓట్లేసుకున్నారు. పట్టణ అభివృద్దిలో భాగంగా నెలరోజుల క్రితం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు చెరువు రోడ్డుకు ఆనుకుని ఉండటంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కోసం దారిపొడుగునా ఫెన్సింగ్, మురికి కాల్వ స్లాబ్ వేసేందుకు రూ.30లక్షల నిధులను మంజూరు చేశారు. కానీ ఆ రోడ్డు ఫెన్సింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఉత్కంఠతో పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రంగు మారి కంపు కొడుతున్న మల్లె చెరువు
రామాయంపేట పట్టణంలోని మురికి కాల్వల నీరంతా మల్లె చెరువులోకే రావడంతో మల్లె చెరువులోని నీరంతా కలుషితమై పచ్చగా రంగుమారి కంపు వాసన వెదజల్లుతోంది. చెరువు ప్రాంతంలో ఉండే పట్టణవాసులు వాసన భరించలేక దవాఖానాల పాలవుతున్నారు. వివిధ రోగాల బారిన పడి లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. చెరువులోని నీళ్లలాగే వారి ఇళ్లలో బోరుబావులు తవ్వుకున్నా తెల్లవారే వరకు వారి పట్టుకున్న కుళాయిలలోని నీరు కూడా చెరువులో ఉండే నీటిలాగే మారుతున్నాయి. చెరువు దగ్గర ఉన్న కుటుంబాలు ఈ వాసన భరించలేక పోతున్నం బాబోయ్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం తమగోన ఆలకించైనా మల్లెచెర్వును ఆధునీకరించాలని కోరుతున్నారు.