న్యాల్కల్, సెప్టెంబర్ 13: స్వయంభువుడిగా వెలిసిన రేజింతల్ సిద్ధివినాయక స్వామి ఆలయం భక్తుల దర్శనాలతో కిక్కిరిసిపోయింది. వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, “బోలో సిద్ధివినాయక మహరాజ్‌కీ జై”.. అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. 50 ఏండ్ల తర్వాత భాద్రపదం మాసంలో సిద్ధివినాయకుడికి ఇష్టమైన రోజైన మంగళవారం వచ్చే అంగరక సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే వేదపండితులు స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, హారతి తదితర పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సిద్ధి,బుద్ధి సామేత వినాయకుడి కల్యాణోత్సవం కన్నుల పండువుగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవను ఊరేగింపును చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన భజన బృందం కీర్తనలు భక్తులను ఆకట్టకున్నాయి.
ఈవేడుకలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను నుంచి భక్తులు భారీగా తరలిరావచ్చారు. జహీరాబాద్, బిచ్కుంద, బీదర్, నారాయణఖేడ్, జోగిపేట్, మనూర్, సంగారెడ్డి, సదాశివపేట్, ఝరాసంగం, రాయికోడ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన పాదయాత్రతో తరలిరావడంతో జహీరాబాద్, బీదర్, అల్లాదుర్గం వెళ్లే మార్గాలు కిక్కిరిసిపోయాయి. పాదయాత్రతో వస్తున్న భక్తులకు పలువురు దాతల ఆధ్వర్యంలో పులిహోర, పండ్లు, పాలను అందజేశారు. ఆలయ కమిటీ, పలువురు దాతలు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ భరత్‌కుమార్, హద్నూర్ ఎస్ఐ వినయ్‌కుమార్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు
సిద్ధివినాయక స్వామివారి వేడుకల్లో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఏపీడీ జయదేవ్, ఎంపీడీవో సుమతి, ఎంపీవో నాగభూషణం, సూపరింటెండెంట్ రాజశేఖర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్, సర్పంచులు ఫోరం మండలాధ్యక్షుడు రవికుమార్, పీఎసీఎస్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, నాయబ్ తహసీల్దార్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.