మెదక్/సంగారెడ్డి, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా ఇదే ప్రభావం కనిపిస్తోంది. వర్షంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షానికి జిల్లా కేంద్రంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. జోరువానతో పట్టణంలోని ఆటోనగర్, వెంకట్రావ్నగర్కాలనీ, రశీద్ కాలనీ, సాయినగర్ కాలనీల్లో భారీగా వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుండగా జిల్లాలోని ఏడుపాయల వన దుర్గామాత ఆలయం ముందు నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాజగోపురం వద్ద అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఘనపూర్, పోచారం ప్రాజెక్టులతో పాటు రాయిన్‌పల్లి ప్రాజెక్టులలోకి వరద నీరు భారీగా చేరుతోంది.
మత్తడి దూకుతున్న చెక్‌డ్యాంలు..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చెక్‌డ్యాంలు మత్తడి దూకుతున్నాయి. అంతేకాక ఆయా మండలాల్లోని చెరువులు అలుగులు పారుతున్నాయి. జిల్లాలోని వెల్దుర్తి మం డలంలోని శెట్పల్లి శివారులో హల్దివాగుపై ఉన్న చెక్‌డ్యాం మత్తడి దూకుతోంది. జిల్లా వ్యాప్తంగా 2314 చెరువులు ఉండగా, ఇప్పటి వరకు 1419చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇందులో 877చెరువులు 70నుంచి 100శాతం నిండాయి. 17 చెరువులు 50నుంచి 75శాతం నిండినట్టు ఇరిగేష న్ శాఖ అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా..
మెదక్ జిల్లా వ్యాప్తంగా 86.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అల్లాదుర్గం మండలంలో 184.4 మి.మీ వర్షపాతం అత్యధికంగా నమోదు కాగా, నార్సింగి మండలంలో 37 మి.మీ అత్యల్ప వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి జిల్లాలో..
గత జూలై నెలలో పడిన భారీ వర్షాలకు జనజీవనం, పంటలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. సెప్టెంబరు నెలలో కూడా వర్షాలు మోస్తరుగా పడుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం ప్రారంభమైన వర్షం ఆదివారం కూడా పడుతూనే ఉంది. జిల్లాలో సరాసరి 44.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారుల తెలిపారు. అత్యధికంగా మనూర్ మండలంలో 95.5 మిల్లీ మీటర్లు వర్షం పడిందని పేర్కొన్నారు. జిల్లాలో అత్యల్పంగా మొగుడంపల్లి మండలంలో 9.3మిల్లీ మీటర్లు, జహీరాబాద్‌లో 12.6మి.మీ వర్షం పడినట్లు అధికారులు వివరించారు. జిల్లాలోని కురుస్తున్న వర్షాల కు వాగులు, వంకలతో పాటు కొన్ని చోట్ల చెరువులు నిండుకుండలను తలపిస్తూ మత్తడి దుంకుతున్నాయి.