జహీరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ- కర్ణాటక సరిహద్దు మండల కేంద్రం.. అక్కడ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువగా ఉంటారు. సర్కారు వైద్యం కోసం కర్ణాటక ప్రజలు కూడా వస్తారు. సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యంతో పాటు నాణ్యమైన సేవలు అందించడంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం)కి మొగుడంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపిక చేశారు. ఆరోగ్య కేంద్రంలో తాగునీరు, పారిశుధ్యం, విద్య, పోషకాహారం వంటి సేవలు అందిస్తున్నారు. వైద్యం కోసం వచ్చే వారికి గౌరవంగా మాట్లాడి చికిత్సలు చేస్తున్నారు ఆరోగ్య వ్యవస్థ మెరుగు పర్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్ర సరిహద్దు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మొగుడంపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి వచ్చే రోగులకు 24 గంటలు పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణులకు సహజ కాన్పులు చేసేందుకు కృషి చేస్తున్నారు. గ్రామాల్లో ఏఎన్ఎంల ద్వారా వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రతిఒక్కరి సమాచారం సేకరించి, వారికి కావాల్సిన ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మందులను అందజేస్తున్నారు.
మొగుడంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు నాణ్యమైన తాగునీరు సరఫరా చేసేందుకు ఫిల్టర్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసేందుకు ప్రత్యేక సౌకర్యాలు కలిపించారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిబంధల మేరకు వైద్యం చేసేందుకు సౌకర్యాలు కల్పించారు. దీంతో జాతీయ ఆరోగ్య మిషన్ బృందం వారం రోజులు మొగుడంపల్లి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపింది. దీంతో జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో ఈ కేంద్రాన్ని ఎంపిక చేశారు. ఈ పథకంలో ఎంపిక కావడంతో ప్రతి ఏడాది ఆరోగ్య కేంద్రానికి రూ.3 లక్షలు మంజూరు చేస్తారు. నిధులు మంజూరు కాగానే మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తారు.
మొగుడంపల్లి పీహెచ్సీలో ప్రసవాలకు వచ్చే గర్భిణులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు కలిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. రోగులకు నాణ్యమైన మందులు, పరీక్షలు చేసేందుకు సౌకర్యం కలిపించింది. మొగుడంపల్లి దవాఖానను ఆదర్శంగా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందరి సహకారంతో మెరుగైన వైద్య సేవలు కలిపించేందుకు కృషి చేస్తాను. జాతీయ స్థాయిలో ఆరోగ్య కేంద్రానికి గుర్తింపు రావడం కోసం పని చేసిన వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు.
– అరుణామోహన్రెడ్డి, జడ్పీటీసీ, మొగుడంపల్లి
ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. జాతీయ ఆరోగ్య మిషన్ పథకం బృందం వారం రోజులు ఉండి మా సేవలను పర్యవేక్షించింది. ఈ పథకంలో ఉండే ప్రతి అంశాన్ని అమలుచేయడంతో మా కేంద్రాన్ని ఎంపిక చేశారు. దీంతో మౌలిక సదుపాయలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఏడాది దవాఖానకు రూ.3 లక్షల నిధులు మంజూరు చేస్తారు. దీంతో అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో పనులు చేస్తాం. గ్రామాల్లో ప్రతి ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి రోగుల సమాచారం సేకరిస్తున్నది.
– డాక్టర్ సీతారామరాజు, మొగుడంపల్లి పీహెచ్సీ