సంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 10: మహాద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఫసల్వాది గ్రామం వేదిక కానున్న ది. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో శ్రీ కైలాస ప్రస్థార మహామేరు పంచముఖి ఉమా మహేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా స్త్రీ రూప గణపతి దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విభిన్న రూపాలతో స్త్రీ విద్యాగణపతిని ప్రతిష్ఠించనున్నారు. ఈ గణపతిని దర్శించుకుంటే 32 గణపతులను దర్శించుకున్న పుణ్యఫలం కలుగుతుందని గణపతి తంత్రం చెబుతున్నది. ఆలయ నిర్మాణంలో భాగంగా ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు శ్రీవిద్యాగణపతి యాగ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అన్ని ఏర్పాట్లు చేసింది.
ప్రపంచంలోనే మొట్టమొదటగా నిర్మాణమవుతున్న స్త్రీరూప విద్యాగణపతి దర్శనం సర్వమోక్ష పథమని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వరశర్మ సిద్ధాంతి అన్నారు. శనివారం పసల్వాది ఉమా మహేశ్వర స్వామి ఆలయ ఆవరణలో స్త్రీ విద్యాగణపతి యాగ మహోత్సవానికి సంబంధించిన వివరాలు వెల్లడించా రు. అతి త్వరలో స్త్రీ రూప విద్యా గణపతి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. 12నుంచి 14 వరకు జరిగే యాగ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించాలన్నారు. స్త్రీ అంటేనే శక్తికి సంకేతమని, స్త్రీ రూపంలో ఉన్న గణపతిని దర్శించడంతో ఆయురారోగ్యాలు, సుస్థిర కీర్తి, మోక్షపథం కలుగుతుందని అన్నారు. మహోన్నత వేదపండితుల సమక్షంలో ప్రతి రోజు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు యాగాలు జరుగుతాయన్నారు. యాగంలో 15 రకాల తీర్థాలు స్వీకరిస్తే పరిపూర్ణ దేహశక్తి కలుగుతుందని ఆయన తెలిపారు.